నేతలు హద్దు మీరుతున్నారు జగన్…!

పరిధి.. పరిమితులు ఉంటాయన్న విషయాన్ని మర్చిపోవటం కొంతమంది వైసీపీ నేతలకు అలవాటే. దూకుడే తమ ఆయుధం అన్నట్లుగా వ్యవహరించే తీరు మిగిలిన పార్టీలతో పోలిస్తే.. వైసీపీ నేతల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు దూకుడు ప్రదర్శించటం మామూలే. అందుకు భిన్నంగా పవర్ చేతిలో లేనప్పుడు సైతం చెలరేగిపోవటం.. అధికారులపై విరుచుకుపడటం లాంటివి వైసీపీ నేతలకే సాధ్యమయ్యే పనులుగా చెబుతారు.

క్రిష్ణా జిల్లాలో తాజాగా చోటుచేసుకున్న ఘటన తరహాలో.. జగన్ సర్కారులో చోటు చేసుకొని ఉంటే గంటల వ్యవధిలో రియాక్షన్ ఉండేదన్న మాట వినిపిస్తోంది. మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారిని ఉద్దేశించి వైసీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జి నోరుపారేసుకున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. అదే సమయంలో.. పెద్ద చర్చనీయాంశంగా మారింది.

క్రిష్ణా జిల్లా తాడిగడప పరిధిలోని కానూరు సర్కిల్ కాలువ గట్లపై ఆక్రమణలను తొలగించి.. అక్కడున్న వారికి పునరావాసం కల్పించటంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ షేక్ నజీర్.. అధికారులతో కలిసి వెళ్లారు. కాలువ గట్లను ఆక్రమించుకొని నివాసాలు ఏర్పాటు చేసుకున్న 18కుటుంబాలకు ప్రత్యామ్నాయంగా రెండేసి సెంట్ల చొప్పున వేల్పూరులో స్థలాల్ని కేటాయించారు. ఈ పట్టాలను పంపిణీ చేసేందుకు కమిషనర్ ఇతర అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఈ సమయంలో అక్కడకు వచ్చిన వైసీపీ పెనుమలూరు నియోజకవర్గ ఇన్ ఛార్జి దేవభక్తుని చక్రవర్తి అనూహ్య రీతిలో స్పందించారు. అక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకోకుండానే.. పెద్దగా అరుస్తూ కమిషనర్ మీదకు దూసుకొచ్చారు. ‘ఏయ్.. ఏంటి నీకు చెప్పేది. ఇక్కడి నుంచి వెళ్లు. నువ్వెవడివి చెప్పడానికి. మేం అన్నీ చేస్తాం. నువ్వు ఏం చేస్తావ్? ఏం పీకుతావో.. పీక్కో. నువ్వేం చేయలేవ్. నీకు ఏ అధికారం లేదు. మిమ్మల్ని చూసి ఎవడూ భయపడడు. పోయి.. చేతనైంది చేసుకో’ అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడారు.

మీరు ప్రభుత్వ అధికారితో మాట్లాడుతున్నారని గుర్తుంచుకోండి.. ప్రజలంతా చూస్తున్నారంటూ కమిషనర్ వారించే ప్రయత్నంగా చేయగా.. మరింత ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ‘నువ్వు అధికారివే కాదు. నీకు ఏ అధికారం లేదు. ఏం పీక్కుంటావో.. పీక్కో’ అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడటంతో.. కమిషనర్.. ఇతర అధికారులు పట్టాల పంపిణీని ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. వైసీపీకి చెందిన కొంతమంది స్థానికులతో కలిసి వెళ్లిపోతున్న కమిషనర్.. అధికారులను సైతం రెచ్చగొట్టేలా.. రాజకీయ లబ్థికోసం వ్యాఖ్యలు చేసిన వైనం చూసినోళ్లు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఒక మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారిని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ నేత తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇలాంటి ఘటనలకు ప్రభుత్వపరంగా స్పందన ఏమీ ఉండదా? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి పలువురు వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం. ఈ ఉదంతంపై స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. రౌడీయిజం సరికాదంటూ మండిపడ్డారు.

మరోవైపు ప్రభుత్వ అధికారిని అడ్డుకున్న ఉదంతంలో చక్రవర్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ  సందర్భంగా జగన్ ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఒకవేళ ఇలాంటి సీన్ జగన్ ప్రభుత్వంలో టీడీపీ నేత చేసి ఉంటే.. గంటల వ్యవధిలో అరెస్టు జరగటంతో పాటు.. తీవ్రమైన పరిణామాలు వేగవంతంగా సాగేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకు భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వంలో పరిస్థితులు ఉన్నాయన్న విమర్శ బలంగా వినిపిస్తోంది.