ష‌ర్మిల వ‌ర్సెస్ జ‌గ‌న్‌.. రంగంలోకి కేవీపీ..?

వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డి వార‌సులమంటూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆయ‌న పిల్ల‌లు చేస్తున్న కీచులాట‌.. ఆ కుటుంబాన్ని అభిమానించే వేలాది మందిని బాధిస్తున్నాయి. ఈ వ్య‌వ‌హారం ముడిప‌డ‌క‌పోవ‌డం.. ఎవ‌రికి వారు ఒకరిపై ఒక‌రు క‌త్తులు నూరుకోవ‌డం వంటివి స‌రికాద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. వైఎస్‌కు అత్యం త‌స‌న్నిహితుడు… ఒక‌ప్పుడు ఆయ‌న ఆత్మ‌గా ప్ర‌చారంలో ఉన్న కేవీపీ రామ‌చంద్ర‌రావు జోక్యం చేసుకుంటున్న‌ట్టు తెలిసింది.

వైసీపీ వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు.. కేవీపీ.. జ‌గ‌న్‌ను క‌లుసుకునేందుకు రెండు రోజుల్లో వ‌స్తున్న‌ట్టు స‌మాచారం. అయితే.. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. అటు ష‌ర్మిల‌.. ఇటు జ‌గ‌న్‌ల మ‌ధ్య ఆస్తుల నుంచి రాజ‌కీయాల వ‌ర‌కు.. ర‌గ‌డ‌లు కొన‌సాగుతున్నాయి. ఇవి ప్ర‌త్య‌ర్థి పక్షాలకు రాజ‌కీయ అస్త్రాలుగా మారుతున్నాయి. దీనిలోనూ ఒక కీల‌క విష‌యం ఉంది. ఈ కుటుంబ వ్య‌వ‌హారం.. అటు జ‌గ‌న్‌కు, ఇటు ష‌ర్మిల‌కు ఏదో ఒక ప‌క్షానికి లాభిస్తే.. ఎలాంటి ఇబ్బంది లేదు.

కానీ.. అటు తిరిగి .. ఇటు తిరిగి.. ఈ వ్య‌వ‌హారం.. ఇత‌ర పార్టీల‌కు ప్ల‌స్ అవుతోంద‌న్న చ‌ర్చ ఉంది. దీనినే కొంద‌రు కాంగ్రెస్ వాదులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌ధ్యే మార్గంగా ఇరు ప‌క్షాల మ‌ధ్య రాజీనా.. లేక స‌ర్దుబాటు చేయ‌డమా.. లేక స‌రిదిద్ద‌డ‌మా ? అనే కోణంలో కేవీపీ రంగంలో దిగుతున్నార‌న్నది వైసీపీకి చెందిన ఓ కీల‌క రెడ్డి నాయ‌కుడు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా వైసీపీ నాయ‌కుల‌ను కుక్క‌ల‌తో పోల్చ‌డం.. ఇత‌ర విమ‌ర్శ‌లు వంటివిష‌యంలో ష‌ర్మిల దూకుడును కూడా వారు త‌ప్పుబ‌డుతున్నారు.

అదేస‌మ‌యంలో కాంగ్రెస్ ప్ర‌గ‌తిని కోరుకునే వారు కూడా.. ఇది స‌రికాద‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే కేవీపీ ద్వారా ఇరు ప‌క్షాల మ‌ధ్య రాజీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఆస్తుల విష‌యం అయితే.. ఇప్ప‌టికే కోర్టుల్లో ఉంది. ఇక‌, రాజ‌కీయంగా ఎవ‌రి దారి వారిది.

కానీ.. ఈ మ‌ధ్యంలో ప్ర‌త్య‌ర్థుల‌కు అవ‌కాశం ఇచ్చేలా జ‌రుగుతున్న ప‌రిణామాల‌పైనే వారు చ‌ర్చ‌లు చేస్తార‌ని తెలుస్తోంది. అయితే.. ఈ విష‌యంలో ఏమేర‌కు కేవీపీ స‌క్సెస్ అవుతార‌న్న‌ది చూడాలి. గ‌తంలోనూ ఆయ‌న రెండు సంద‌ర్భాల్లో చ‌ర్చ‌లు జ‌రిపేందుకు రెడీ అయ్యారు. కానీ, విర‌మించుకున్నారు. మ‌రి ఈ ద‌ఫా ఏమేర‌కు ఆయ‌న చ‌ర్చ‌లు ఫ‌లిస్తాయో చూడాలి.