ఏపీలో ‘కరెన్సీ’ టెక్నాలజీతో ‘పట్టా’ల తయారీ

భూములకు సంబంధించిన పట్టాదార్ పాస్ పుస్తకాలను ఇలా అనుకుంటే.. అలా ట్యాంపరింగ్ చేయొచ్చు. ఒక సర్వే నెంబర్ మీద ఎన్నైనా నకిలీ పాస్ బుక్కులను ఇట్టే పుట్టించేయొచ్చు. అక్రమార్కులకు ఈ వ్యవహారం చాలా ఈజీ అని చాలా సందర్భాల్లో తేలిపోయింది. అయితే ఏపీ విషయానికి వస్తే…ఇకపై ఆ రాష్ట్రంలో పట్టాదార్ పాస్ పుస్తకాలను ట్యాంపరింగ్ చేయడం కుదరదు. ఎందుకంటే… ఆ పుస్తకాల తయారీకి కరెన్సీ నోట్ల ముద్రణకు ఉపయోగిస్తున్న టెక్నాలజీని వాడుతున్నారట. వెరసి ఏపీలో రైతులు తమ భూములు అన్యాక్రాంతమైపోతాయన్న భయం లేకుండా జీవనం సాగించవచ్చన్న మాట.

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం బాపట్ల జిల్లా సూరేపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీ భూమి- మీ హక్కు కార్యక్రమంలో పాలుపంచుకున్న చంద్రబాబు… రైతులకు కొత్తగా రూపొందించిన పట్టాదార్ పాసు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన చంద్రబాబు… ప్రతి నెల 9వ తేదీన రాఫ్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో మీ భూమి- మీ హక్కు కార్యక్రమాన్ని నిర్వహిస్తానని తెలిపారు. వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్రంలోని 1.40 కోట్ల మంది రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేస్తామని ఆయన ప్రకటించారు.

ఈ సందర్భంగా వైసీపీ పాలనలో రైతుల భూములు అన్యాక్రాంతం అయిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. పాస్ బుక్కులను ట్యాంపరింగ్ చేసిన నాటి అధికార పార్టీ నేతలు రైతుల భూములను లాక్కున్నారని విమర్శించారు. అయితే ఇకపై రైతుల భూములకు భద్రత కల్పించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. పట్టాదార్ పాస్ పుుస్తకాలను ట్యాంపరింగ్ చేయకుండా ఉండేలా ఏం చేయాలన్న ఆలోచన చేసిన తమ ప్రభుత్వం… పాస్ బుక్కుల తయారీకి కరెన్సీ నోట్ల తయారీకి వినియోగించే సాంకేతికతను వాడాలని తీర్మానించామన్నారు.

ప్రస్తుతం రైతులకు అందజేస్తున్న కొత్త పాస్ పుస్తకాలన్నీ కరెన్సీ నోట్ల టెక్నాలజీతో రూపొందించినవేనని చంద్రబాబు చెప్పారు. ఈ పాస్ బుక్కులను ట్యాంపరింగ్ చేయడం ఇక కుదరదని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో రైతుల భూములకు భద్రత కల్పించే విషయాన్ని గాలికొదిలేసిన జగన్… తన ఫొటోను మాత్రం పాస్ బుక్కులపై వేసుకున్నారని ఎద్దేవా చేశారు.

ఇదే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లిన తాము… జగన్ మరోమారు అధికారంలోకి వస్తే…రైతుల భూములకు భద్రత లేదని చెప్పామన్నారు. తమ భూములకు భద్రత కావాలంటే.. కూటమికి ఓటు వేయాలని పిలుపునిచ్చామని… ఆ పిలుపునకు రైతులు సానుకూలత చూపారని… తాము అధికారంలోకివచ్చిన వెంటనే జగన్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామని ఆయన వివరించారు.