వైసీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులనుద్దేశించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి వైసీపీ నేతల యత్నించారు కూడా. అంతేకాకుండా, రాష్ట్రంలో పలు చోట్ల ఆర్కేకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆర్కేపై వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
‘‘నువ్వన్న మాటలకు రాధాకృష్ణ…నిన్ను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్ను తిప్పిన స్టేషన్ తిప్పకుండా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతాం’’ అని జగన్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతలు, శ్రేణులు, కార్యకర్తలు, వారి భార్యలు అంటే నీకు అంత అలుసయిపోయారా అంటూ మండిపడ్డారు. అయితే, ఇదే మాటలు వాళ్ల భార్యలనుద్దేశించి వైసీపీ నేతలు, కార్యకర్తలు మాట్లాడితే వారికి కూడా నచ్చదు అని అన్నారు. ఇక, ఆర్కే మాటలను చంద్రబాబు, లోకేశ్, పవన్ ఖండించకుండా సమర్థించడం శోచనీయమన్నారు.
గతంలో ఎప్పుడో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను పట్టుకొని వైసీపీకి చెందిన యువకులను, యువతులను స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని, రేపు ఇదే గతి రాధాకృష్ణకు కూడా పడుతుందని జగన్ హెచ్చరించారు. ఈ క్రమంలోనే జగన్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
వైసీపీ హయాంలో నిండు శాసన సభలో సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపైవైసీపీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానిస్తున్నప్పుడు జగన్ నిద్రపోయారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మొన్నటికి మొన్న సీఎం చంద్రబాబునుద్దేశించి అంబటి రాంబాబు బూతులు తిట్టినప్పుడు జగన్ ఎందుకు ఖండించలేదని నిలదీస్తున్నారు. ఆర్కే కామెంట్ల సమర్థనీయం కాదని, కానీ, వైసీపీ నేతల బూతు పురాణాన్ని కూడా జగన్ ఖండించినప్పుడే ఆర్కే కామెంట్లను ఖండించే అర్హత వస్తుందని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates