పాపం దీదీ… ఏం జ‌రుగుతుందో!?

బ‌ల‌వంతుడు బ‌ల‌వంతుడే అన్న‌ట్టు.. రాజ‌కీయం.. రాజ‌కీయ‌మే!. ఈ మాట ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి, తృణ‌మూల్ కాంగ్రె స్ పార్టీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ.. ఉర‌ఫ్ దీదీ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తోంది. కొన్నాళ్ల కింద‌ట ఆమె.. సుప్రీంకోర్టుకు వ‌చ్చారు. త‌న వాద‌న‌ను తానే వినిపిస్తాన‌ని చెప్పారు. `ఒక్క ఐదు నిమిషాలు నా మొర వినండి` అని వేడుకున్నారు. దీనికి ప్ర‌తిగా.. ప్ర‌స్తుత ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. “మీరు చాలా బిజీగా ఉంటారు. అయినా.. న్యాయం కోసం కోర్టుకు వ‌చ్చారు. పైగా మీరు మ‌హిళ‌. ఐదు నిమిషాలు కాదు.. 10 నిమిషాలు తీసుకోండి“ అన్నారు.

దీంతో మ‌మ‌తా బెన‌ర్జీ.. త‌న వాద‌న‌నుబ‌లంగా వినిపించారు. త‌న రాష్ట్రంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం చేప‌ట్టిన `స‌ర్‌`(స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్‌) ప్ర‌క్రియ దారి మ‌ళ్లుతోంద‌ని.. అన్యాయంగా ఓట్ల‌ను తొల‌గిస్తున్నార‌ని.. ఇప్ప‌టికే కోటి మంది ఓట్లు తీసేశార‌ని.. ఇది పౌరుల ప్రాధ‌మిక హ‌క్కు అని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. “ఎవ‌రో చెబితే.. బ‌ల‌మైన వాదన వినిపిస్తారో లేదో అని నేనే స్వ‌యంగా వ‌చ్చాను మైలార్డ్‌“ అని వ్యాఖ్యానించారు. దీంతో సుప్రీంకోర్టు తాము చూస్తామ‌ని హామీ ఇచ్చింది. అనంత‌రం.. అనేక వాద‌న‌లు.. ప్ర‌తివాద‌న‌లు జ‌రిగాయి. ఇక‌, ఈ నెలలో రెండు ద‌శ‌ల్లో ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఏం జ‌రిగింది?

కానీ, చిత్రం!. మూడు మాసాల కింద‌టేమ‌మ‌తా బెన‌ర్జీ అలెర్ట్ అయినా.. ఓట్ల‌ను కాపాడుకునే ప్ర‌య‌త్నం జ‌రిగినా.. చేతులు కాలిపోయాయి. స‌మ‌యం మించిపోయింది. స‌ర్ ప్ర‌క్రియ ద్వారా తొల‌గించిన ఓట్ల‌ను స‌మీక్షించేందుకు సుప్రీంకోర్టు ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని స్థానిక కోర్టుల న్యాయాధికారుల‌ను ప్ర‌త్యేకంగా నియ‌మించింది. దీంతో వారు రంగంలోకి దిగారు. ఎన్నిక‌ల సంఘం స‌ర్ లో భాగంగా తొల‌గించిన 91 ల‌క్ష‌ల‌కుపైగా ఓట్లలో దాదాపు 48 ల‌క్ష‌ల ఓట్ల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని నిర్ణ‌యించారు. కానీ.. ఇది ఆల‌స్య‌మైంది.. కాదు కాదు.. ఎన్నిక‌ల సంఘం కావాల‌నే ఆల‌స్యం చేసింద‌ని మ‌మ‌తా బెన‌ర్జీ అంటున్నారు.

ప్ర‌స్తుతం 27 ల‌క్ష‌ల ఓట్లు(తొల‌గించిన‌) ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో నామినేష‌న్లు పూర్త‌యిపోయాయి. ఇక‌, ఓట‌రు జాబితా పున‌రుద్ధ‌ర‌ణ జ‌ర‌గ‌దు. మ‌రో 21 ల‌క్ష‌ల‌కు పైగా ఓట్ల‌ను పున‌రుద్ధరించాల‌ని అనుకున్నా.. దీనికి కూడా గురువారం సాయంత్రంలోగానే చేయాలి. కానీ, ఈలోగా.. మ‌ళ్లీ సుప్రీంకోర్టులో విచార‌ణ చేప‌ట్టాలి. ప్ర‌త్యేకంగా ఆదేశాలు ఇవ్వాలి. అప్పుడు కానీ.. క‌నీసం 21 ల‌క్ష‌ల మంది ఓట్లుపున‌రుద్ధ‌రించే అవ‌కాశం లేదు. కానీ, ఇవ‌న్నీ.. జ‌రుగుతాయా? అంటే.. “మేం ఇప్పుడు బిజీగా ఉన్నాం. ఏదైనా ఎన్నికలు పూర్తయ్యాకే“ అని ఎన్నిక‌ల‌సంఘం తేల్చేసింది. సో.. మొత్తానికి అనుకున్న ప‌ని అయిపోయింది.. ఇప్పుడు బాధ‌ప‌డ‌డం దీదీ వంతు!!