కేరళం ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీనియర్ నేత, కేరళ సీఎం విజయన్‌పై విమర్శలు చేయడం.. దానికి ఆయన ప్రతి విమర్శలు చేయడం తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారం ఇప్పుడు వ్యక్తిగత విమర్శల వరకు దూసుకువచ్చింది. “నన్ను విజయన్ `డ్యాష్` అన్నారు“ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించే పరిస్థితికి తీసుకువచ్చింది. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఎన్నికల ప్రచారం ఎక్కడ గాడి తప్పింది? అనేది ఆసక్తికరం.
మొత్తం 7 రోజుల పాటు కేరళంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. తొలి రెండు రోజులు ఆయన తన ప్రచారాన్ని ప్రశాంతంగానే ముందకు తీసుకువెళ్లారు. కానీ, అనుకున్న విధంగా తన ప్రచారానికి జోష్ దక్కలేదు. దీంతో రేవంత్ యూటర్న్ తీసుకుని.. తెలంగాణలో తన పాలనను ముడిపెడుతూ.. విజయన్‌పాలనను ఎద్దేవా చేయడం ప్రారంభించారు. పథకాలు, పేదరికం, నిరుద్యోగం.. సహా.. నీతిఆయోగ్ నివేదికలు ఇలా.. అనేక అంశాలను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దీంతో విజయన్.. రేవంత్ ను కార్నర్ చేసుకుని తన ప్రచారాన్ని తీవ్రతరం చేశారు.
ఈ క్రమంలోనే ఇరు పక్షాల మధ్య వ్యక్తిగత అంశాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఈ విషయంలో రేవంత్ ను… విజయన్ దుర్భాషలాడారని తెలిసింది. దీనికి కారణం.. రేవంత్ రెడ్డి.. విజయన్‌ను దొంగతో పోల్చడమే.
గతంలో విజయన్‌పై దుబాయి బంగారం స్మగ్లింగ్ యువతికి సహకరించారన్న ఆరోపణలు వున్నాయి. దీనిపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. కానీ, ఈ కేసు ఎటూ తేలలేదు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకునే రేవంత్ రెడ్డి తాజాగా ఆయనను దొంగగా సంబోధించారు. దీంతో విజయన్ కూడా ఇదేవ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
మరో రెండు రోజుల్లోనే(గురువారం) ఎన్నికలు జరగనున్న కేరళం గురించి ఇద్దరు ముఖ్యమంత్రులు ఇలా రోడ్డున పడడం.. `డ్యాష్-డ్యాష్` పదాలను ప్రయోగించడం వంటివి రాజకీయంగా ఏమంత బాగోలేదని పరిశీలకులు చెబుతున్నారు.
మరోవైపు రేవంత్ చేసిన వ్యాఖ్యలు.. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆయన చెబుతున్న లెక్కలను బీఆర్ ఎస్ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. పరోక్షంగా కేరళకు ఇక్కడి లోపాలను వారు చేరవేస్తున్నారు. సో.. మొత్తంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రు ల మధ్య తీవ్రస్థాయి యుద్ధంలో పైచేయి కంటే కూడా.. రాజకీయం ఎక్కువగా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates