ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న సునీల్‌కు రఘురామకు మధ్య వివాదం మరింత ముదిరింది. రఘురామ.. తనను `వాడు వీడు` అని వ్యాఖ్యానించినట్టు సునీల్ చెబుతున్నారు. ఈ క్రమంలో రఘురామను ఆయన.. `గేదెలా పెరిగావ్` అంటూ బాడీ షేమింగ్ చేశారు. తాజాగా విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో రఘురామపై సునీల్ విరుచుకుపడ్డారు. రఘురామ చుట్టూ ఎంగిలిమెతుకులు తినే కుక్కలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
ఎందుకీ రగడ!
వాస్తవానికి వైసీపీ హయాంలో తనను అక్రమంగా అరెస్టు చేశారని రఘురామ చెబుతున్నారు. అంతేకాదు.. అప్పటి సీఐడీ చీఫ్‌గా వ్యవహరించిన సునీల్ తనను అరెస్టు చేయడంతోపాటు కస్టడీలో టార్చర్ చేశారని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. అయితే.. దీనిపైనా ఇరువురు సోషల్ మీడియాలో కవ్వించుకుంటున్నారు. ఆరోపణలు చేసుకుంటున్నారు. తిట్టిపోసుకుంటున్నారు. ఇంతలోనే తన సొంత నియోజకవర్గం ఉండిలోని ఆకివీడులో ఉన్న పెదపాడులో పురాతన రామాలయాన్ని ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా రఘురామ సందర్శించారు.
ఈ సందర్భంగా అక్కడి దళిత క్రైస్తవులు.. రఘరామపై దాడికి యత్నించారు. దీనిపైనా పోలీసులు కేసులు నమోదు చేసి సుమారు 60 మందిని అరెస్టు చేశారు. అయితే.. ఈ ఘటన వెనుక సునీల్ ప్రమేయం ఉందని.. నిందితులతో ఆయన ఫోన్ మాట్లాడి రెచ్చగొట్టి.. తనపై దాడిచేసేలా ప్రేరేపించారని రఘురామ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఇరువురి మధ్య ఆన్‌లైన్ వేదికగా మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే సునీల్‌ను రఘురామ వాడు-వీడు అన్నట్టుగా ఆయన ఆరోపించారు. దీనికి కౌంటర్‌గా తాజాగా సెల్ఫీ వీడియో విడుదల చేశారు.
దీనిలో తీవ్ర వ్యాఖ్యలతో సునీల్ విరుచుకుపడ్డారు. “గేదెలా పెరిగావ్, నీకు సంస్కారం లేదా? మీ అమ్మానాన్న నీకు నేర్పించలేదా?.“ అని సునీల్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. “నీలి కోటుగాడు“ అని రఘురామ తనను వ్యాఖ్యానించారని.. పేర్కొన్న సునీల్.. తాను ఏకోటు వేసుకుంటే ఏమైందని.. నువ్వేమైనా కొనిచ్చావా? అని నిలదీశారు.
“బ్యాంకులను మోసగిస్తే తప్ప నీకు తెల్లారదు“ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. “నువ్వెంత, నీ బతుకెంత?“ అని దుయ్యబట్టారు. కాగా.. ఈ పరిణామాలపై కూటమి నాయకులు విస్తుబోతున్నారు. దీనిపై జోక్యం చేసుకుని సరిదిద్దాలని.. సీఎం చంద్రబాబుకు సూచనలు, సలహాలు వస్తున్నాయి. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
