ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అనే విషయాలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చేపట్టిన విద్యార్థుల ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో అన్ని రాష్ట్రాల్లోనూ నిరసనలు చేపట్టారు. గవర్నర్ బంగళాలను(లోక్‌భవన్) ముట్టడించే కార్యక్రమాలు చేపట్టారు. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక సహా.. అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఉద్యమించింది.
మరి ఏపీలో సంగతేంటి? అనేదిప్రశ్న. ఏపీ కాంగ్రెస్ పార్టీకి చీఫ్‌గా వ్యవహరిస్తున్న షర్మిల.. గత నాలుగు రోజులుగాసాగుతున్న ఉద్యమాల్లో ఎక్కడా పాల్గొనలేదు. మంగళ వారం, బుధవారం, గురువారం విజయవాడ సహా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు ఉద్య మించారు. ఈ సమయంలో షర్మిల లేకుండానే క్షేత్రస్థాయిలో నేతలు గవర్నర్ బంగళాకు వెళ్లి వినతి పత్రాలు ఇచ్చారు. ఈ సమయంలో కూడా షర్మిల గురించి ఎక్కడా ప్రస్తావన రాలేదు.
మరీ ముఖ్యంగా బుధవారం విజయవాడలో భారీ రగడ చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు.. తీవ్రస్థాయిలో కొట్టుకున్నారు. గుడ్లు, రాళ్లు విసురుకున్నారు. బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ సమక్షంలోనే ఈ ఘర్షణ జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఆయన స్వయంగా కార్యకర్తలను రెచ్చగొట్టి మరీ.. తమపైకి దూసుకువచ్చేలా చేశారని పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులపై దాడికి నిరసనగా బీజేపీ, విద్యార్థులపై లాఠా చార్జీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఒకేసమయంలో ధర్నాకు దిగాయి.
ఈ సమయంలో ఏపీ కాంగ్రెస్ పార్టీకి గుండెకాయ వంటి.. పార్టీ రాష్ట్ర కార్యాలయం `ఆంధ్రరత్న` భవన్‌లోకి బీజేపీ కార్యకర్తలు దూసుకువెళ్లారు. ఇలా.. ఇరు పక్షాలు రక్తాలు కారేలా కొట్టుకున్నారు. అయితే.. ఇంత జరిగినా.. షర్మిల బయటకు వచ్చి పెదవి విప్పకపోవడం.. విద్యార్థుల నిరసనలకు కూడా మద్దతుగా రోడ్డెక్కక పోవడం వంటివి పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. అంతేకాదు.. ఆమె ఫోన్ కూడా స్విచ్ఛా వస్తోందని ఓ కీలక నాయకుడు మీడియాతోనే వ్యాఖ్యానించడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates

