అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే.. ముందుండాలి. వాటిని వినియోగించుకోవాలి. ఈ విషయంలో వైసీపీ తనకు దక్కిన పెద్ద అవకాశాన్ని చేజార్చుకుందనే అభిప్రాయం గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపిస్తోంది. ప్రధానంగా మూడు విషయాల్లో వైసీపీ ఈ అవకాశాన్ని వదులుకున్నట్టు కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
1) మూడు రాజధానులు: మూడు రాజధానులు అనే ఫార్ములా జగన్ తెరమీదికి తెచ్చినప్పుడే.. ప్రజలు తిరస్కరించారు. విశాఖను ప్రధాన రాజధానిని చేస్తామని అన్నప్పుడు.. అక్కడివారు వ్యతిరేకించారు. దీనికితోడు.. అమరావతి రైతుల త్యాగం.. ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసింది. వారిని అణిచేసిన తీరును రాష్ట్ర ప్రజలు మౌనంగా గమనించి.. ఎన్నికల వేళ బలంగా తీర్పు ఇచ్చారు. అంటే.. ప్రజలు అమరావతికే కట్టుబడ్డారు.
ఈ నేపథ్యంలో తాజాగా అమరావతి బిల్లు వచ్చినప్పుడు.. జగన్.. మౌనంగా తన మూడు రాజధానుల ప్రతిపాదనను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించి ఉంటే.. ఇమేజ్ పెరిగేదని పరిశీలకులు చెబుతున్నారు. కానీ..మావిగన్ అనే కొత్త ప్రతిపాదన.. ఎవరికీ అంతుచిక్కని ప్రతిపాదన చేసి.. మరింత ట్రోల్ అవుతున్నారని అంటున్నారు. కానీ.. జగన్ వచ్చిన అవకాశాన్ని వదులుకుని.. కొత్త సమస్యలు.. తెచ్చుకున్నారు.
2) లోక్‌సభ: లోక్‌సభలో వైసీపీకి నలుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ.. స్పీకర్ వీరికి 20 నిమిషాల సమయం ఇచ్చారు. కానీ, కేవలం 5 నిమిషాలలోనే ఎంపీ మిథున్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించి.. వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. రాజధాని అమరావతికి వ్యతిరేకం కాదంటూనే సభలో నుంచి బయటకు రావడం పెద్ద తప్పుగా పరిశీలకులు చెబుతున్నారు. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని.. తమ వాదన వినిపించేందుకు ప్రయత్నించి ఉంటే బాగుండేదని అంటున్నారు.
3) రాజ్యసభ: ఇక్కడ సభ్యులు ఎక్కువ.. సమయం తక్కువ అన్నట్టుగా వైసీపీ పరిస్థితి మారిపోయింది. కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే ఇవ్వడాన్ని తప్పుబట్టి వైసీపీ సభ్యులు సభ నుంచి బయటకు వచ్చారు. కానీ.. వాస్తవానికి ఆ 5 నిమిషాల్లోనే వైసీపీ సభ్యులు మాట్లాడి.. తమ వాదనను వినిపించే అవకాశం సద్వినియోగం చేసుకుని ఉంటే.. ఆ పరిస్థితి వేరేగా ఉండేదని పరిశీలకులు చెబుతున్నారు. ఏదేమైనా.. వైసీపీ చక్కని అవకాశాన్ని చేజార్చుకుందని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
