నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా లేకుండా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఏపీకి రాష్ట్రం నడిబొడ్డున అమరావతిని రాజధానిగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు. చంద్రబాబు సర్కారు నుంచి ఈ ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో నాటి నుంచి జగన్ నోట మూడు రాజధానులు అనే మాట పదే పదే వినిపిస్తోంది. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు రాజధానుల మాటను ప్రస్తావించిన జగన్… ఇప్పుడు తాను విపక్షంలోకి మారిన తర్వాత కూడా అదే మాటను వల్లిస్తుండటం గమనార్హం. 

సీఎం హోదాలో నాడు అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా జగన్ ఎంపిక చేశారు. ఆ దిశగా వడివడిగానే అడుగులు వేశారు. నాడు వైసీపీ సర్కారు ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లును శాసనమండలిలో మెజారిటీ ఉన్న టీడీపీ సమర్థవంతంగానే అడ్డుకుంది. ఆ దెబ్బకు ఇక చట్టబద్ధత విషయాన్ని మరిచిన జగన్… విశాఖను పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేసే దిశగా వేగంగా సాగారు. ఈలోగా 2024 ఎన్నికలు రావడంతో ఆయన మూడు రాజధానుల సిద్ధాంతానికి అడ్డుకట్ట పడింది.

అయితే జగన్ మళ్లీ సీఎం అయితే ఎలా అన్న వాదనతో కూటమి సర్కారు అమరావతిని ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతూ మొన్న అసెంబ్లీలో ఓ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్రం దానికి లోక్ సభ ఆమోదాన్ని సాధించింది. ఈ సందర్భంగా బుధవారం ఓ వైపు పార్లమెంటులో అమరావతి బిల్లుపై జరుగుతుండగా… మరోవైపు తాడేపల్లిలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జగన్ మరోమారు మూడు నగరాల రాజధాని అంటూ కొత్త సిద్ధాంతాన్నిప్రస్తావించారు.

ఉమ్మడి కృష్ఱా జిల్లా కేంద్రం మచిలీపట్నం, ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడ, గుంటూరు జిల్లా కేంద్రం గుంటూరులను కలుపుకుని రాజధాని ప్రాంతంగా ప్రకటించాలని జగన్ డిమాండ్ చేశారు. మచిలీపట్నం నుంచి విజయవాడకు 110 కిలో మీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు 40 కిలో మీటర్ల దూరం ఉంటుందని, మొత్తంగా 150 కిలో మీటర్ల పరిధిలో రాజధానిని ఏర్పాటు చేయాలని, దీనిని తాము ప్లాన్ బీగా కూటమి సర్కారుకు ప్రతిపాదించామని జగన్ చెప్పారు. ఈ మూడు నగరాలను కలుపుతూ రాజధానిని అభివృద్ధి చేస్తే అతి తక్కువ వ్యయంతోనే రాజధాని రూపుదిద్దుకుంటుందని చెప్పారు. 

జగన్ మీడియా సమావేశం విన్న వారంతా.. ఏపీ రాజధాని విషయానికి వస్తే జగన్ కు మూడు అనే సంఖ్య తప్పించి మరో మాట గుర్తుకు రావడం లేదన్న సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఇటుే మచిలీపట్నం అయినా, అటు గుంటూరు అయినా అమరావతి అభివృద్ధి చెందితే… వాటికవే అభివృద్ధి బాటలో నడుస్తాయి. ఇక అమరావతి కోసం సేకరించిన భూములన్నీ కూడా గుంటూరు జిల్లా పరిధిలోనివే. ఈ రెండు నగరాలతో పాటు అమరావతికి అత్యంత సమీపంలో ఉన్న విజయవాడ ఎలాగూ అమరావతితో సరిసమానంగా అభివృద్ధి చెందుతుంది. ఈ విషయాలను మరిచిన జగన్… మావిగన్ పేరిట కొత్త ప్రతిపాదన చేయడం గమనార్హ:.