బ్యాంకుల్లోని ఖాతాల్లో సొమ్ము నిల్వ చేసుకోవడం కామనే. అయితే.. మరింత విలువైన వస్తువులు.. బంగారం, ఆస్తిపత్రాలు వంటివాటిని కూడా బ్యాంకుల్లో భద్ర పరుచుకునేందుకు `లాకర్ వ్యవస్థ` అందుబాటులో ఉంది. గత 55 సంవత్సరాలుగా ఈ సేవలు బ్యాంకులు అందిస్తున్నాయి. ఒకప్పుడు పెద్దలకు మాత్రమే అందుబాటులో ఉన్న లాకర్లు.. ఇటీవల కాలంలో సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఓ మాదిరి వార్షిక అద్దెతో ఈ లాకర్లను బ్యాంకులు సాధారణ వ్యక్తులకు కూడా అందిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యాపారుల వరకు ఇప్పుడు లాకర్లను ఆశ్రయిస్తున్నారు.
అయితే.. తరచుగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు.. లేదా దొంగతనాల కారణంగా బ్యాంకు లాకర్ల వ్యవహారం చర్చనీయాంశం గా మారింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సదరు లాకర్లలో ఖాతా దారులు దాచుకున్న సొమ్ము.. బంగారం, ఆస్తి పత్రాలు వంటివాటికి ఎవరు జవాబు దారీ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అదేవిధంగా లాకర్లలో ఏం పెట్టారు? ఏం దాచుకున్నారు? డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు వంటివిఉన్నాయా? అనే విషయాలను బ్యాంకులు తెలుసుకుంటాయా? లేదా? అనేది కూడా ప్రశ్నగానే మిగిలింది. ఖాతాదారుల లాకర్లను బ్యాంకులు స్వతంత్రంగా పర్యవేక్షిస్తాయా? అనే సందేహం కూడా ఉంది.
దీనిపై తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభ వేదికగా సమాధానం ఇచ్చారు. బ్యాంకు లాకర్లలో ఖాతా దారులు ఏం దాచుకున్నారు? ఏయే ఆస్తులను అందులో ఉంచారు? ఎంత బంగారం పెట్టారు.. ఇలా ఏ విషయాన్నీ బ్యాంకులు తనిఖీ చేయబోవని ఆమె వెల్లడించారు. దీనికి రిజర్వ్ బ్యాంకు నిబంధనలు కూడా అంగీకరించవని తెలిపారు. ఖాతా దారుల గోప్యతకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు. అంతేకాదు.. బ్యాంకులు ఎప్పుడూ.. లాకర్లను స్వతంత్రంగా తెరిచేందుకు కూడా నిబంధనలు అంగీకరించవని ఆమె తేల్చి చెప్పారు. కాబట్టి లాకర్ల విషయంలో ఖాతా దారులకు ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు.
ఇక, ప్రమాదాలు, దొంగతనాలు జరిగినప్పుడు లాకర్లలో దాచిన విలువైన వస్తువులకు ఎవరు బాధ్యులు అనే ప్రశ్నపై స్పందిస్తూ .. దానికి ఖాతా దారులే పూచీ వహించాలని తేల్చి చెప్పారు. “లాకర్‌లో ఏం పెట్టారు అనే విషయం తెలియనప్పుడు.. ఆ వస్తువులకు బ్యాంకులు హామీ ఉండవు. పూచీ వహించవు“ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే.. ఏదైనా ప్రమాదాలు, దొంగతనాలు జరిగినప్పుడు.. లాకర్లు ధ్వంసమైతే.. ఆ సమయంలో లాకర్ చేసిన బీమా మొత్తాన్ని 100 రెట్లకు పెంచి నష్టపరిహారంగా చెల్లిస్తారని వివరించారు. ఒకవేళ లాకర్ తీసుకుని దానిలో ఏమీ దాచుకోకపోయినా.. ఇదే నిబంధన వర్తిస్తుందని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates