బాబు మాట: కార్యకర్తలకూ ఉందో రిజర్వేషన్..!

టీడీపీ ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా సాగిపోయింది. సీనియర్ల నుంచి జూనియర్ కార్యకర్తల వరకు పెద్ద ఎత్తున మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలి వచ్చారు. పసుపు పండుగను విజయవంతం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లతో కలిసి విందు కూడా ఆరగించారు. ఇక దీంతో కార్యక్రమం ముగిసింది. కానీ అసలు విషయం అక్కడే మొదలైంది. విందు భేటీలో చాలా మంది సీనియర్ కార్యకర్తలు టికెట్ల ప్రస్తావన చేశారు.

తాము పదేళ్లకు పైగానే పార్టీలో ఉన్నామని కొందరు, పార్టీ స్థాపించిన నాటి నుంచి తమ కుటుంబం టీడీపీకి అంకిత భావంతో పనిచేస్తోందని మరికొందరు చంద్రబాబుకు వివరించారు. పనిలో పనిగా తమకు కూడా ఎమ్మెల్యే టికెట్లు కావాలని గుంటూరు, విజయనగరం, కర్నూలుకు చెందిన పలువురు కార్యకర్తలు ఆయన ముందు తమ వినతులు వినిపించారు. వాస్తవానికి ఈ విషయంపై కొన్నాళ్లుగా పార్టీలోనూ చర్చ సాగుతోంది.

కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు గుర్తింపు కావాలని, దాంతోపాటు టికెట్ కూడా కావాలని కోరుకుంటున్న వారు చాలా మందే ఉన్నారు. గత ఎన్నికల్లో కొందరికి ఇలానే టికెట్లు ఇచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మరింత మంది ఇప్పుడు టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు కూడా రిజర్వేషన్ ప్రకటించే అవకాశంపై పరిశీలన చేస్తామని వారిని ఊరడించారు.

ఇదే సమయంలో మంత్రి లోకేష్‌కు ఈ కీలక బాధ్యతలు కూడా అప్పగించారు. పార్టీలో కష్టపడి పనిచేస్తున్న వారికి అవకాశం కల్పించేందుకు, వారి కష్టాన్ని గుర్తించేందుకు లోకేష్ ద్వారా పార్టీ తెలుసుకుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం చంద్రబాబు ఆలోచన ప్రకారం 5-6 శాతం పార్టీ కార్యకర్తలకు రిజర్వేషన్ (అప్రకటిత) అమలు చేసే అవకాశం ఉంది. అంటే వారి ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా కేవలం పార్టీకి చేస్తున్న కృషిని గుర్తించి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. తద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.