ఏపీలోని కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలన్న సంకల్పంతో తాజాగా ప్రత్యేకంగా అసెంబ్లీని కొలువు దీర్చింది. సుమారు 7 గంటలపాటు సాగిన సభలో ఏకైక అజెండాగా అమరావతికి చట్టబద్దతను సభ్యులు చర్చించారు. అనంతరం.. దీనిని గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపించారు. అయితే.. అసెంబ్లీ భేటీ అయింది కానీ.. మండలిని హాజరు పరచలేదు. ఈ వ్యవహారంపై వైసీపీ నాయకులు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ.. అసలు మండలిని హాజరు పరచకుండా అసెంబ్లీలో చేసే తీర్మానాలకు చట్టబద్ధత ఉంటుందా? పెద్దల సభకు విలువ లేదా? మండలిని ఎందుకు కొలువుదీర్చలేదు.. అని వ్యాఖ్యానించారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
శాసనమండలి లేకపోయినా లేదా మండలి ఆమోదం లేకపోయినా అసెంబ్లీలో తీర్మానం చేయవచ్చునని రాజ్యాంగంలోని ఆర్టికల్ 164-167 వరకు చెబుతున్నాయి. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర అసెంబ్లీకి మాత్రమే విస్తృత అధికారాలు ఉన్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు, బిల్లులు లేదా `మండలి` రద్దు వంటి అంశాలపై అసెంబ్లీలో సాధారణ లేదా ప్రత్యేక మెజారిటీతో తీర్మానం ఆమోదించి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపవచ్చు. అంతేకాదు.. శాసన మండలి ఉన్నప్పటికీ, అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలను ఒకసారి తిరస్కరించవచ్చు. కానీ రెండోసారి అదే తీర్మానాన్ని సభ ఆమోదిస్తే మండలితో సంబంధం లేకుండా అది ఆమోదం పొందినట్టే.
గతంలో జగన్ చేసిందే..
గత వైసీపీ హయాంలో సీఎం జగన్ ఏకపక్షంగా ఈ నియమాన్ని వినియోగించుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 ప్రకారం.. రాష్ట్ర శాసనమండలిని అప్పట్లో ఆయన రద్దు చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటు ఆమోదానికి పంపారు. అంతేకాదు.. మండలి రద్దు తీర్మానాన్ని కేవలం అసెంబ్లీలోనే ఆమోదించినప్పుడు.. టీడీపీ నేతల ప్రశ్నలకు కూడా కనీసం జవాబివ్వలేదు. ఇక, మరో కీలక విషయం.. అసెంబ్లీ అనేది రాష్ట్ర ప్రజల ప్రాతినిధ్య సభ. ఎన్నికైన ప్రజాప్రతి నిధులు మాత్రమే ఉంటారు. కాబట్టి.. ప్రజాస్వామ్యంలో వీరికి పెద్ద పీట వేశారు. ఇదే విషయాన్ని గతంలో జగన్ గుర్తు చేశారు.
అంతేకాదు.. మండలిలో పనీపాటలేని వారు మాత్రమే ఉంటారని.. వారి సలహాలు అవసరం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. జగన్ చేసినట్టే ప్రస్తుత ప్రభుత్వం చేయాలా? అంటే.. కాదు. కానీ.. విధానపరమైన నిర్ణయాల విషయంలో ప్రభుత్వాలకు రాజ్యాంగమే స్వేచ్ఛనిచ్చింది. అందుకే.. నేరుగా ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రవేశ పెట్టారు. సభా నాయకుడే ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత.. దాని ప్రాధాన్యం మారుతుంది. ఇక, 2వ కారణం.. ఇది బిల్లు కాదు.. తీర్మానం. సో.. మండలిలో ప్రవేశ పెట్టి సలహాలు.. సూచనలు తీసుకునే అవకాశం.. అవసరం కూడా ఉండదు. అందుకే సభకు మాత్రమే దీనిని పరిమితం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates