ఏపీకి శాశ్వత రాజధాని అమరావతే కానీ…

నవ్యాంధ్రప్రదేశ్ కు శాశ్వత రాజధానిగా అమరావతే కొనసాగనుంది. ఈ మేరకు రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా కొనసాగించాలంటూ కూటమి సర్కారు ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అమరావతిని శాశ్వత రాజధానిగా కొనసాగించాలన్న తీర్మానానికి ఆమోదం తెలిపేందుకు శనివారం ఒక్కరోజు ప్రత్యేకంగా సమావేశమైన ఏపీ అసెంబ్లీ సమావేశంలో ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఒక్క గళమూ వినిపించలేదు.

అసెంబ్లీలో అమరావతి తీర్మానాన్ని సభా నాయకుడి హోదాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిపాదించారు. ఈ తీర్మానంపై సభ్యులంతా తమ అభిప్రాయాలను తెలయజేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు తీర్మానంపై మాట్లాడారు.

వీరిలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేబినెట్ లో కీలక శాఖల మంత్రి నారా లోకేశ్ లు కూడా పాలుపంచుకున్నారు. ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా కొనసాగాల్సిన ఆవశ్యకతను వారు నొక్కి చెప్పారు. అంతేకాకుండా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ కొనసాగడం తమను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందని వారు బాధ పడ్డారు. ఈ తరహా పరిస్థితి ఇకపై రాకూడదని వారంతా ముక్తకంఠంతో చెప్పారు.

మంత్రులు, సభ్యుల ప్రసంగాల అనంతరం… తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడిందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది. తీర్మానాన్ని బలపరుస్తూ ప్రసంగించిన సభ్యులంతా అమరావతి ఆవశ్యకతను వివరించడంతో పాటు అమరావతిని ప్రశ్నార్థకం చేస్తూ వైసీపీ తీసుకున్న చర్యలను తూర్చారబట్టారు.

ఇదిలా ఉంటే…శనివారమే ఈ తీర్మనాన్ని కూటమి సర్కారు కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. ఈ తీర్మానాన్ని ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టేలా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చంద్రబాబు చర్చించనున్నట్లు సమాచారం. కేంద్రంలోనూ కూటమి పార్టీలతో కూడిన సర్కారే ఉన్న నేపథ్యంలో ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఈ తీర్మానానికి ఆమోదం లభించడం, ఆపై అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల కావడం జరుగుతాయని తెలుస్తోంది.

అయితే అమరావతికి చట్టబద్ధతతో పాటుగా రాజధాని ప్రాంతంలో కూటమి సర్కారు మొదలుపెట్టిన పనులు ఎప్పటిలోగా పూర్తి అవుతాయన్న దానిపై చర్చ నడుస్తోంది. ఈ పనులన్నీ 2029 ఎన్నికల్లోగా పూర్తి అయితేనే బాగుంటుందన్న వాదన వినిపిస్తోంది. కూటమి సర్కారు ప్రతిపాదించిన పనులు పూర్తి చేయడం మాట అటుంచితే…కనీసం ఆయా పనులు ప్రారంభమయ్యే దిశగా చర్యలు చేపట్టాలన్న వాదన వినిపిస్తోంది.