క‌విత క‌ల్లోలం… ఏ పార్టీకి?!

ఒకరు పార్టీ పెట్టారంటే.. కొత్త‌గా వ‌చ్చే ఓట్లు అంటూఏమీ ఉండ‌వు. ఏదో ఒక పార్టీకి సానుకూలంగా ఉన్న ఓట్ల‌ను.. లేదా త‌ట‌స్థులుగా ఉన్న వారి ఓట్ల‌ను మాత్ర‌మే సొంతం చేసుకుని ఆ పార్టీ ముందుకు సాగాలి. ఉమ్మ‌డి ఏపీలో 2012లో కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత‌గా పార్టీ పెట్టుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో స్థాపించిన ఈ కొత్త కుంప‌టిలో నాడు చేరింది.. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులే. ఆ పార్టీ ప‌రివార‌మే!. ఇప్ప‌టికీ.. ఆ పార్టీకిచెందిన నాయ‌కులు మెజారిటీ భాగం వైసీపీలో ఉన్నారు. పేర్ని నాని, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు.. ఇలా ఉద్ధండులు వైసీపీలో క‌నిపిస్తారు.

త‌ద్వారా.. కాంగ్రెస్ పార్టీ ఏపీలో తీవ్ర న‌ష్టాన్ని ఎదుర్కొంది. పెద్ద ఎత్తున ఓటు బ్యాంకును కూడా కోల్పోయింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు క‌విత కూడా తెలంగాణ‌లో పార్టీ పెడుతున్నారు. ఏప్రిల్ 25న త‌న పార్టీని అధికారికంగా లాంచ్ చేసేందుకు ముహూర్తం పెట్టుకున్నారు… వేదిక కూడా సిద్దం చేసుకున్నారు. దీంతో ఇప్పుడు క‌విత ఏ పార్టీ నుంచి ఓటు బ్యాంకును సొంతం చేసుకుంటారు? అనేది కీల‌కంగా మారింది. వాస్త‌వానికి ఆమె పార్టీ ప్ర‌తిపాద‌న చేసిన నాటినుంచి కూడా.. ఈ చ‌ర్చ ఉన్న‌ప్ప‌టికీ.. త‌ర్వాత కాలంలో ఆమె వేసిన అడుగులు.. తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను స‌మీక్షిస్తున్న నేప‌థ్యంలో ఆమె ప్ర‌ధానంగా రెండు పార్టీలలో క‌ల్లోలం రేప‌నున్నార‌ని తెలుస్తోంది.

1) త‌న తండ్రి పార్టీ బీఆర్ఎస్ నుంచి మెజారిటీనాయ‌కుల‌ను క‌విత త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేయొచ్చ‌న్న‌ది ప‌రిశీల‌కులు చెబుతున్న‌మాట‌. 2023 ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్క‌నివారు.. ఆశించి భంగ ప‌డినవారు.. ఇప్ప‌టికే పార్టీకి దూరంగా ఉన్నారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన త‌ర్వాత‌.. త‌మ‌కు కేసీఆర్ ద‌ర్శ‌న‌మే దుర్ల‌భంగా మారింద‌ని వ‌గ‌రుస్తున్న వారు కూడా.. క‌విత‌కు అనుకూలంగా మారే అవ‌కాశం క‌నిపిస్తోందని చెబుతున్నారు. ఈ రెండు ప‌రిణామాల‌లో ఏది జ‌రిగినా.. అది క‌విత‌కు ప్ల‌స్ అవుతుంది.. అదేస‌మ‌యంలో కేసీఆర్‌కు మైన‌స్ అవుతుంది. ఇదేస‌మ‌యంలో స‌మాజాన్ని కూడా.. క‌విత `గ‌త పాల‌న‌లో తెలంగాణ‌కు న్యాయం జ‌ర‌గ‌లేదు` అని చెప్ప‌డం ద్వారా సెంటిమెంటును రాజేసే ప్ర‌య‌త్నంలో ఉన్నారు.

2) రాముడు-పాల‌న అంటూ.. ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి.. బీజేపీ ఓటు బ్యాంకును కూడా క‌విత త‌న‌దైన శైలిలో త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేయొచ్చ‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. నేరుగా హిందూత్వ వాదిగా మారకుండా.. క‌విత బ్యాలెన్స్‌డ్ రాజ‌కీయాలు చేసే యోచ‌న‌లో ఉన్నారు. దీంతో ఈ ప్ర‌భావం బీజేపీ వైపు నుంచి నాయ‌కుల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేయొచ్చు. ఉదాహ‌ర‌ణ‌కు ఈట‌ల రాజేంద‌ర్ వంటివారు.. బీజేపీలో పొస‌గ‌లేక పోతున్నారు. సో.. ఇలాంటి వారిని త‌న‌దైన శైలిలో ఆమె ఆక‌ర్షిస్తే.. అనంత‌రం.. జిల్లాకు ఒక బ‌ల‌మైన నాయ‌కుడు వ‌స్తారు. ఇదే.. ఇప్పుడు క‌విత వ్యూహాత్మ‌కంగా వేస్తున్న అడుగుగా ప‌రిశీల‌కులు చెబుతున్నారు.