టీడీపీ అంటేనే రాజకీయ విశ్వవిద్యాలయం అని సీఎం చంద్రబాబు తరచుగా చెబుతుంటారు. తరచుగా మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా.. ఇదే విషయాన్ని చెబుతుంటారు. ఇప్పుడు మరింత ఎక్కువగా టీడీపీ స్కూల్‌ను బలోపేతం చేయాలని పార్టీ నిర్ణయించింది. ఇప్పటి వరకు నాయకులను తయారు చేసేందుకు ఏడాదికి కేవలం 50-70 రోజులు మాత్రమే కేటాయించారు. నాయకులకు శిక్షణ, భవిష్యత్తు వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు.
కానీ, ఇక నుంచి ఏడాదికి 300 రోజుల పాటు టీడీపీ స్కూల్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. తద్వారా కొత్త నాయకులను మరింత ఎక్కువ మందిని ప్రోత్సహించడంతోపాటు.. పార్టీని యువతరం నేతలతో సుసంపన్నం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దీంతో ఎక్కువ మంది నాయకులు అందివస్తారన్న అంచనా వేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి 88 సెగ్మెంట్లను కొత్తవిగా ఎంపిక చేయనున్న నేపథ్యంలో మరింత నాయకుల కొరత తీర్చాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో ఇప్పటి వరకు స్కూల్ అంటే ఒకవిధంగా ఉంటే.. ఇక నుంచి మరింత బలమైన శక్తిగా టీడీపీని రాటు దేల్చాలని నిర్ణయించారు. నాలుగున్నర దశాబ్దాల పార్టీలో అనేక మంది నాయకులు మంత్రులు అయ్యారు. ఇద్దరు ఏకంగా ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. ఇలానే.. భవిష్యత్తు ఉపయోగపడే నాయకులు.. పార్టీ సిద్ధాంతాలపై పట్టు పెంచుకునే వారికి పార్టీ ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ క్రమంలోనే వచ్చే నెల నుంచి 300 రోజుల పాటు శిక్షణను కంపల్సరీ చేయనున్నారు.
నాయకులకు ఈ పరిణామం అందివస్తున్న అవకాశంగా మంత్రి నారా లోకేష్ చెప్పారు. అంతేకాదు.. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కూడా యువతకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం టీడీపీ యువ నాయకుల సంఖ్య 40 శాతం మాత్రమే ఉంది. దీనిని 60 నుంచి 80 శాతానికి తీసుకువెళ్లాలన్నది పార్టీ నిర్ణయం.
అంతేకాదు.. సీనియర్లను, పార్టీలో పదవులు తీసుకుంటున్న వారిని పీఏసీగా ఒక కమిటీని ఏర్పాటు చేసి.. దానిలో బాధ్యతలు అప్పగించనున్నారు. తద్వారా.. యువతకు భారీ అవకశాలు పెంచనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates