పల్నాడు జిల్లాలోని కీలక నియోజకవర్గం మాచర్ల. ఇక్కడ నుంచి వరుసగా విజయాలు దక్కించుకున్న పిన్నెల్లి రామకృష్నారెడ్డి ఇటీవల కాలంలో తీవ్ర వివాదాల్లో చిక్కుకున్నారు. ఎన్నికల సమయంలో ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసు ఆయనను వెంటాడింది. ఆ తర్వాత.. టీడీపీ నాయకుల జంట హత్యల కేసు కూడా పిన్నెల్లి సోదరులపై ఉండడంతో ఇటీవలే జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చారు.
ఇదిలావుంటే.. ప్రస్తుతం మాచర్లలో పిన్నెల్లి ప్రభావం ఎంత? అనేది చర్చకు దారితీస్తోంది. వాస్తవానికి.. ఈవీఎం కేసులో ఆయన సొంత నియోజకవర్గంలోకి వెళ్లరాదన్న కోర్టు షరతులు ఉన్న విషయం తెలిసిందే. దీంతో గుంటూరులోనే ఆయన ఉంటున్నారు. లేదా.. హైదరాబాదకు మకాం మార్చారు. కానీ.. నియోజకవర్గంలో ఏం జరుగుతోందన్న విషయాలను మాత్రం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
టీడీపీ హవా..
ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పోచా బ్రహ్మానందరెడ్డి హవా సాగుతోంది. అయితే.. ఇది వివాదంగా కాదు. అభివృద్ధి, సంక్షేమం వంటివాటిని పరిగణనలోకి తీసుకుని అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గంలో ఒకప్పుడు ఉన్న కక్షలు.. ఇప్పుడు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ముఖ్యంగా ఏం కావాలో.. అది చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
గతంలో ఉన్న వర్గపోరు లేకుండా చేసేందుకు కూడా పోచా ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఒకప్పుడు కొన్ని మండలాల ప్రజలు భయం గుప్పిట్లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది.. కానీ.. తాజాగా ఆయా మండలాల్లోని ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
గతంలో టీడీపీలో ఉన్నారన్న కారణంగా.. నియోజకవర్గం నుంచి తరిమేసి.. వేధించిన పరిస్థితులు ఉన్నాయి. కానీ, ఇప్పుడు దాదాపు అలాంటి పరిస్థితి లేకుండా ఉండడంతోపాటు.. నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణాన్ని పెంచేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
