ఆ విషయంపై నోరు విప్పిన పవన్

వైసీపీ హ‌యాంలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం చంద్ర‌బాబు, ఇత‌ర మంత్రులు మాత్రమే మాట్లాడుతున్నారు. అయితే.. తొలిసారి.. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వైసీపీ ఆర్థిక అరాచ‌కాల‌పై స్పందించారు. అసెంబ్లీలో బ‌డ్జెట్‌పై జ‌రిగిన చ‌ర్చ‌లో  కీల‌క ప్ర‌సంగం చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వైసీపీ రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశ‌నం చేసింద‌ని.. దీంతో రాష్ట్రం 30 ఏళ్ల‌పాటు వెన‌క్కి వెళ్లిపోయింద‌ని విమ‌ర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చేశార‌ని వ్యాఖ్యానించారు.

ముఖ్యంగా వైసీపీ హ‌యాంలో 9 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర‌కు అప్పులు చేశార‌ని.. మరో 35 వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టి వెళ్లారన్నారు. ఇప్పుడు వాటికి వ‌డ్డీలు క‌ట్టేందుకే.. సొమ్ములు స‌రిపోవ‌డం లేద‌న్నారు. పెండింగులో పెట్టిన బిల్లుల‌ను నెమ్మ‌దిగా క్లియ‌ర్ చేస్తున్న‌ట్టు ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు 25 కోట్ల‌రూపాయ‌ల మేర‌కు బిల్లులను చెల్లించామ‌న్నారు. కేంద్రం నుంచి వ‌చ్చే ప‌థ‌కాల‌ను కూడా వైసీపీ ప్ర‌భుత్వం ప‌క్క‌న పెట్టి రాష్ట్రానికి తీర‌ని అన్యాయం చేసింద‌న్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం 90 శాతం నిధులు ఇచ్చే ప‌థ‌కాల‌కు కూడా 10 శాతం రాష్ట్ర వాటా ఇవ్వ‌కుండా వైసీపీ వెన‌క్కి త‌గ్గింద‌ని.. దీంతో ఆయా ప‌థ‌కాలు ఆగిపోయాయ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. ప్ర‌స్తుతం సీఎం చంద్ర‌బాబు కేంద్రాన్ని ఒప్పించి దాదాపు 75 ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌న్నారు. వాటికి సంబంధించిన మ్యాచింగ్ గ్రాంట్ల‌ను కూడా ఎప్ప‌టిక‌ప్పుడు విడుద‌ల చేస్తున్న‌ట్టు ప‌వ‌న్ వివ‌రించారు. దీనివ‌ల్లే రాష్ట్రంలో అభివృద్ధి ప‌నులు వేగంగా సాగుతున్నాయ‌న్నారు.

రాష్ట్ర బ‌డ్జెట్‌పై ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శంస‌లు కురిపించారు. ప్ర‌స్తుతం ఆర్థిక ప‌రిస్థితి  ఇబ్బందుల్లో ఉన్న‌ప్ప‌టికీ.. 3.32 ల‌క్ష‌ల కోట్ల బ‌డ్జెట్‌ను అన్ని రంగాల‌కు, అన్ని వ‌ర్గాల‌కు స‌మాన ప్రాధాన్యం క‌ల్పిస్తూ.. రూపొందించార‌ని ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్‌ను మెచ్చుకున్నారు. ఎంతో అనుభ‌వం ఉంటే త‌ప్ప‌.. ఇలా చేయ‌లేర‌ని కొనియాడారు. ప్ర‌స్తుతం రాష్ట్ర ప్ర‌భుత్వం న్యాయ‌శాఖ‌కు ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు ప‌వ‌న్ వివ‌రించారు. అమ‌రావ‌తిలో హైకోర్టు నిర్మాణంతోపాటు.. జిల్లాల వారిగా కూడా కోర్టుల‌ను నిర్మిస్తున్న‌ట్టు తెలిపారు.