ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తే కాక్రోచ్‌లు లేస్తాయని, ఆంధ్రప్రదేశ్‌లో తాము కూడా కాక్రోచ్‌లమేనని అని స్వయాన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఈ మాట అందరికీ గుర్తుండే ఉంటుంది. డీఎస్సీ అభ్యర్థుల సమస్యలు మరియు రాష్ట్రంలో ప్రభుత్వ తీరును ఎత్తిచూపుతూ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తప్పులు చేసి వాటిని ఒప్పుకోకుండా ప్రజలను ఇబ్బంది పెడితే భవిష్యత్తులో తీవ్ర వ్యతిరేకత వస్తుందని హెచ్చరించారు.ఇప్పుడు దేశ రాజధానిలో ఆ కాక్రోచ్ లే గొంతెత్తి అరుస్తున్నాయి.. కానీ ఎందుకో జగన్ మౌనంగా ఉండిపోయారు.
డీఎస్సీలో అవకతవకలు జరిగాయి అంటూ వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై కోర్టు మెట్లు కూడా ఎక్కుతోంది. డీఎస్సీకి దరఖాస్తు చేసిన వారు సుమారు 3.35 లక్షల మంది. నీట్‌కు దరఖాస్తు చేసిన వారు 22 లక్షల మందికిపైగా. డీఎస్సీ ప్రభావం ఒక రాష్ట్రానికే పరిమితం. నీట్ ప్రభావం దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై ఉంటుంది. మరి అలాంటి పరీక్షలో అవకతవకల ఆరోపణలు వచ్చి, కేంద్ర ప్రభుత్వం స్వయంగా రీ-ఎగ్జామ్ నిర్వహించే స్థితి వచ్చినప్పుడు అదే స్థాయిలో వైసీపీలో ఆందోళన ఎందుకు కనిపించలేదు?
ఢిల్లీలో గత 25 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పలు రాష్ట్రాలలో ఆయా పార్టీల నేతలు కూడా స్పందిస్తున్నారు. కానీ ఏపీలో నేతలు మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. తమకు లాభం చేకూర్చే అంశాలపై ఒక రకమైన స్పందన, రాజకీయ ప్రయోజనం కనిపించని అంశాలపై మరో రకమైన స్పందన. ఈ ధోరణే ప్రజల్లో వైసీపీ రాజకీయాలపై అనుమానాలను పెంచుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
