తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. కల్వకుంట్ల కవిత మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల ఢిల్లీ మద్యం కుంభకోణంలో స్థానిక సీబీఐ కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో రాష్ట్రస్థాయిలో జిల్లాల పర్యటన చేస్తానని కార్యకర్తలకు చెప్పిన ఆమె.. తర్వాత.. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా మూసీనది పరివాహక ప్రాంతంలో నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లు, భారీ కట్టడాలకు వ్యతిరేకంగా మంగళవారం అనూహ్యంగా ఆమె నిరసనకు దిగారు. సాయంత్రం 5 గంటల నుంచి నార్సింగ్‌లోని ఓ నిర్మాణం ముందు తన కార్యకర్తలతో కలిసి నిరసనకు దిగారు.
పేదలు, బడుగుల ఇళ్లను కూల్చి వేస్తున్న హైడ్రాకు.. పెద్దలు నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లు, భారీ భవనాలు కనిపించడం లేదా? అని కవిత ప్రశ్నించారు. మూసి నదిని కొందరు అక్రమార్కులు ఆక్రమిస్తున్నారని.. అయినా హైడ్రాకు అవేవీ కనిపించడం లేదని విమర్శించారు. పేదలు అప్పులు చేసి నిర్మించుకున్న చిన్నపాటి ఇళ్లను మూసీ వంకతో తొలగిస్తున్నారని.. రాత్రికి రాత్రి వాటిని తొలగిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను పేదల పక్షాన పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. హైడ్రా అధిపతి రంగనాథ్ వచ్చి.. తనకు సమాధానం చెప్పాలని కవిత భీష్మించారు.
ఈ క్రమంలో రాత్రి పొద్దు పోయే వరకు కూడా కవిత రోడ్డుపైనే కూర్చున్నారు. తన అనుచరులతో కలిసి అక్కడే నిరసన వ్యక్తం చేశారు. హైడ్రాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో చీకటి పడడం.. స్థానికంగా ఎలాంటి వెలుగు లేకపోవడంతో కార్యకర్తలు.. తమ సెల్ ఫోన్లలోని టార్చ్ లను ఆన్ చేయడంతో ఆ వెలుగులోనే కవిత తన నిరసనను కొనసాగించారు.
అయితే.. ఈ వ్యవహారంపై హైడ్రా స్పందించలేదు. కాగా.. గతంలోనే ఈవ్యవహారంపై బీఆర్ ఎస్ నిరసన వ్యక్తం చేసింది. మాజీ మంత్రి కేటీఆర్ హైడ్రాకు వ్యతిరేకంగా గళం వినిపించారు. పేదల ఇళ్లను కూల్చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై అప్పట్లోనే రంగనాథ్ స్పందించారు. తాము నిబంధనల మేరకే వెళ్తున్నామని చెప్పారు. ఇక, ఇప్పుడు కవిత నిరసన ప్రాధాన్యం సంతరించుకుంది.
కవిత అరెస్టు
ధర్నా చేస్తున్న కవితను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి 7.30 గంటల సమయంలో పోలీసులు ధర్నా చేస్తున్న ప్రాంతాన్ని చుట్టుముట్టారు. నిరసనను విరమించాలని సూచించారు. అయితే తాము శాంతి యుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నామని..ఇది తమ హక్కు అనిపలువురు జాగృతి నేతలు తెలిపారు.
హైడ్రా కమిషనర్ వచ్చి తమకు సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఉన్నతాధికారుల సూచనల మేరకు కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే.. ఈ క్రమంలో కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates