పవన్ ఆఫీసు భద్రతా లోపాలపై బాబు ఆరా

గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ కేంద్ర‌కార్యాల‌యం భ‌ద్ర‌త‌పై సీఎం చంద్ర‌బాబు శ‌నివారం ఉద‌యం స‌మీక్షించారు. అస‌లు అక్క‌డ ఏం జ‌రిగింద‌ని.. జ‌న‌సేన పార్టీ సీనియ‌ర్‌నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌ను అడిగి తెలుసుకున్నారు. శుక్ర‌వారం దుండ‌గులు పార్టీ కార్యాల‌యంలోకి ప్ర‌వేశించి.. కార్ల‌ను ధ్వంసం చేసిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న రాజ‌కీయంగా.. జ‌న‌సేన‌లో తీవ్ర క‌ల‌క‌లం రేపింది. వాస్త‌వానికి ప‌టిష్ట భ‌ద్ర‌త ఉంద‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు.

ప‌వ‌న్ అభిమానులం అంటూ.. ఎవ‌రు వెళ్లినా.. ఊరికేనే లోప‌లికి కూడా రానివ్వ‌రు. అన్ని అనుమ‌తి పత్రా లు, మెసేజ్‌లు చూసిన త‌ర్వాత‌.. అన్ని విధాలా వారిని ప‌రీక్షించిన త‌ర్వాతే లోప‌లికి అనుమ‌తిస్తున్నారు. అయితే.. శుక్ర‌వారం మాత్రం దుండ‌గులు లోప‌లికి రావ‌డం .. విధ్వంసం సృష్టించ‌డంతో పార్టీ నాయకులు కూడా అలెర్ట్ అయ్యారు. ఈ ప‌రిణామాల వెనుక ఎవ‌రు ఉన్నార‌న్న విష‌యంపై కూపీ లాగుతున్నారు. అనుమానితుల‌ను మంగ‌ళ‌గిరి పోలీసులు ప్ర‌శ్నిస్తున్నారు.

ఈ వ్య‌వ‌హారాల‌న్నీ మీడియాలో ప్ర‌ముఖంగా రావ‌డంతో అలెర్ట్ అయిన సీఎం చంద్ర‌బాబు.. శ‌నివారం ఉద‌య‌మే.. మంత్రి మ‌నోహ‌ర్‌కు ఫోన్ చేసి విష‌యం తెలుసుకున్నారు. పార్టీ కార్యాల‌యం భ‌ద్ర‌త‌, చుట్టూ ఉన్న ఫెన్సింగ్ వంటివాటిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ కార్యాల‌యానికి ప్ర‌స్తుతం మూడు వైపుల మాత్ర‌మే ప‌టిష్ట‌మైన గోడ ఉంది. నాలుగో వైపు.. హెలిపాడ్ కోసం స్థ‌లాన్ని వ‌దిలేయ‌డంతో అటు వైపు గోడ నిర్మాణం జ‌ర‌గ‌లేద‌ని తెలుసుకున్నారు.

దీంతో పాటు.. యాక్స‌స్ డోర్ల ఏర్పాటు.. మ‌రింత భ‌ద్ర‌తా ప‌ర‌మైన చ‌ర్య‌ల విష‌యాన్ని ఆరా తీసిన చంద్ర బాబు.. ప్ర‌భుత్వ ప‌రంగా ఎలాంటి భ‌ద్ర‌త అవ‌స‌ర‌మో అడిగి తెలుసుకున్నారు. అవ‌స‌ర‌మైన అన్ని స‌దుపాయాలు క‌ల్పించేలా డీజీపీ గుప్తాను ఆయ‌న ఆదేశించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. ప్ర‌స్తుతం టీడీపీ కార్యాల‌యానికి ఎలాంటి భ‌ద్ర‌త‌ను క‌ల్పిస్తున్నారో.. అదే భ‌ద్ర‌త‌ను జ‌న‌సేన పార్టీ కార్యాల‌యానికి కూడా క‌ల్పించే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.