తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. వీటిలో తెలంగాణకు చెందిన రెండు స్థానాలు ఉన్నాయి. బీఆర్ ఎస్‌కు చెందిన కేఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన అభిషేక్ మను సింఘ్వీ పదవీకాలం ముగియనుంది.
ఇక, అసెంబ్లీలో శాసన సభ్యుల సంఖ్య ఆధారంగా జరగనున్న ఈ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ ఎస్‌కు బలం తక్కువగా ఉన్నందున ఈ రెండు స్థానాలు కూడా అధికార పార్టీ కాంగ్రెస్‌కే దక్కనున్నాయి. అయితే వీటిలో ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఇప్పుడు కీలక చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కేంద్ర స్థాయిలో బలమైన గళం వినిపించాల్సిన అవసరం ఉంది.
ఈ నేపథ్యంలో మరోసారి అభిషేక్ మను సింఘ్వీకే అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. పైగా ఈయన ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది కూడా. దీంతో తరచుగా కాంగ్రెస్ తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను మరోసారి ప్రోత్సహించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలావుంటే మరో సీటు అంశం ఇప్పుడు దోబూచులాడుతోంది.
ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఈ సీటును సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈయన సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. పైగా గత ఏడాది జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున ఆయన పోటీ చేశారు. అయితే ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు.
ఈ నేపథ్యంలో సుదర్శన్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చే ఆలోచన ఉన్నట్టు సమాచారం. అప్పట్లోనే ఆయనకు పదవిపై హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అప్పట్లో, “సుదర్శన్ రెడ్డి గెలుస్తారా లేదా అనేది మాకు తెలుసు. ఆయనకు బలమైన మద్దతు ఉంటుంది,” అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఖాళీ అయిన సీటును ఆయనకు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates