మరోసారి కన్నీరు పెట్టిన ఎర్రబెల్లి

ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల ఫలితాలు తారమారైనా సరే చాలామంది నేతలు పెద్దగా చలించరు. అయితే, మరి కొందరు నేతలు మాత్రం ఓటమిని జీర్ణించుకోలేక, ఫలితాలు తమకు అనుకూలంగా రాక ఎమోషనల్ అవుతుంటారు.

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ కోవలోకే వస్తారు. తొర్రూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ కోల్పోవడంతో ఎర్రబెల్లి కంటతడి పెట్టారు. కార్యకర్తలకు తాను ఏ సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని చెబుతూ ఆయన బావోద్వేగానికి లోనయ్యారు.

తొర్రూరులో మొత్తం 16 స్థానాలకుగాను 7 కాంగ్రెస్ గెలుచుకోగా, 9 బీఆర్ఎస్ గెలుచుకుంది. బీఆర్ఎస్ కు చెందిన ఒక కౌన్సిలర్ అనూహ్యంగా చివరి నిమిషంలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. దీంతో, ఈ రెండు పార్టీలు చెరి 8 స్థానాలతో పోటీలో నిలిచారు.

ఎక్స్ ఆఫీషియోగా కడియం కావ్య ఓటు వేయాల్సి ఉన్నా ఓ వివాదం వల్ల ఆమె వేయలేదు. దీంతో తొర్రూరు మున్సిపల్ చైర్మన్ పదవిని లాటరీ పద్ధతిలో కాంగ్రెస్ గెల్చుకుంది. అయితే, మున్సిపల్ కార్యాలయానికి వెళ్లకుండా ఎర్రబెల్లిని పోలీసులు అడ్డుకున్నారు.

ఆయనతోపాటు ఆయన భార్యను అదుపులోకి తీసుకున్నారు. దీంతో, ఎర్రబెల్లి రోడ్డుపై ధర్నా చేశారు. ఆ తర్వాత ఆయన ఎమోషనల్ అయ్యారు. తన కేడర్‌ను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆయన బాధపడ్డారు. అయితే, ఇలా ఎర్రబెల్లి ఎమోషనల్ కావడం, కన్నీళ్లు పెట్టడం తొలిసారి కాదు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తున్న ఎర్రబెల్లిని గత ఎన్నికల్లో 26 ఏళ్ల యశస్విని రెడ్డి ఓడించడంతో ఆయన కన్నీరు పెట్టుకున్నారు.