బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్.. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌లపై సెటైర్లు పేల్చారు. ఈ రెండు పార్టీలకు వాలంటైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, వారి అక్రమ సంబంధం.. ఇదే విధంగా కొనసాగాలని.. ప్రజల ఛీత్కారాలు కూడా ఇలానే ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్-కాంగ్రెస్-ఎంఐఎం పార్టీలకు వాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెబుతున్నానన్నారు. కాంగ్రెస్‌తో సంసారం చేస్తూ.. బీఆర్ఎస్‌తో కన్నుకొడుతోందంటూ.. ఎంఐఎంపై తీవ్ర విమర్శలు చేశారు.
“బీఆర్ ఎస్- కాంగ్రెస్ పార్టీలది ఫెవికాల్ బంధం కాదు.. ‘ఎం-సీల్’ బంధం.” అని బండి వ్యాఖ్యానించారు. వీరి బంధానికి అనుసంధాన పార్టీనే ఎంఐఎం అని తెలిపారు. కరీంనగర్‌లో బీజేపీ భారీ విజయం నమోదు చేసిందన్నారు. కరీంనగర్‌లో ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ఈ విజయాన్ని సాధించినట్టు తెలిపారు. ప్రస్తుతం కరీంనగర్ మునిసిపల్ ఎన్నికల్లో మేజిక్ ఫిగర్‌ను దాటి నట్టు చెప్పారు. ఇండిపెండెంట్లు గుండుగుత్తగా తమకే మద్దతు తెలుతున్నారని అన్నారు.
కానీ, బీజేపీకి మేయర్ పీఠం దక్కకుండా.. బీఆర్ఎస్-కాంగ్రెస్-ఎంఐఎంలు జట్టు కడుతున్నాయని బండి విమర్శించారు. వీరి రాజకీయ కుట్రలు కరీంనగర్ వేదిగా బయటకు వస్తున్నాయన్నారు. ఈ మూడు పార్టీల నాయకులు రహస్య చర్చలు కాకుండా.. బహిరంగ చర్చలే చేసుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు ఇప్పటికే బీఆర్ఎస్‌తో చర్చలు జరిపారని అన్నారు. కానీ, ప్రజలు మాత్రం బీజేపీతోనే ఉన్నారని తెలిపారు. లాలూచీ రాజకీయాలకు కరీంనగర్ వేదికగా మారిందన్నారు.
బీఆర్ఎస్ కు వచ్చిన వార్డులు ఎన్ని.. మేయర్ పీఠాన్ని దక్కించుకునే స్థాయి ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు తమ వారికి ఫోన్లు చేసి.. బేరాలు ఆడుతున్నారని.. అయితే.. తమ వారు కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారన్నారు. కరీంనగర్‌లో కలిసి ముందుకు వెళ్లాలని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల స్థానిక నాయకులు తీసుకున్నారా? ఆయా పార్టీల పెద్దలే ఈ నిర్ణయం తీసుకున్నారా? అని బండి నిలదీశారు. బీఆర్ఎస్‌కు చీమకుట్టకుండా.. కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపైనే అనేక అనుమానాలు ఉన్నాయన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates