వైసీపీ నేత అంబటి రాంబాబు.. సీఎం చంద్రబాబుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక, అంబటి క్షమాపణలు చెప్పాలంటూ.. టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే మీడియా ముందుకు వచ్చిన అంబటి కుమార్తె మౌనిక.. ఇటు సర్కారు, అటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పైనా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు మౌనిక రాజకీయ ఎంట్రీ ఉంటుందా? అనేది ప్రశ్నగా మారింది. పలువురు కాపు నాయకులు కూడా మౌనిక దూకుడును ప్రశంసిస్తున్నారు. వాస్తవానికి గతంలోనూ అనేక మంది వారసురాళ్లు తమ కుటుంబాలకు ఇబ్బందులు తలెత్తినప్పుడు మీడియా ముందుకు వచ్చారు. భూమా నాగిరెడ్డి కుమార్తెల్లో రెండో కుమార్తె.. మౌనిక కూడా ఇలానే దూకుడు ప్రదర్శించారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో 2015-17 మధ్య ఆమె ఫైర్ బ్రాండ్ రాజకీయాలు చేశారు.
దీంతో ఆమెపై కూడా ఇలాంటి చర్చే జరిగింది. కానీ, మౌనిక రాజకీయ అరంగేట్రం చేయలేదు. నిజానికి అక్క భూమా అఖిల ప్రియ కంటే కూడా మౌనికకే ఎక్కువగా మార్కులు పడ్డాయి. అయినప్పటికీ.. ఆమె పొలిటికల్‌గా దూకుడు ప్రదర్శించలేదు. ఇప్పుడు అంబటి కుటుంబం నుంచి మౌనిక వస్తున్నారా? అంటే.. వైసీపీ నాయకులు ఔననే సమాధానం ఇస్తున్నారు. కానీ, ఈ విషయంలో ఆమె ఇప్పటికీ మౌనంగానే ఉన్నారు.
కులం ఒక్కటే సరిపోతుందా.. ?
ప్రస్తుతం అంబటి కుమార్తెకు ఉన్న ఏకైక ట్యాగ్ కులం మాత్రమే. దీనిని ఆధారంగా చేసుకునే ఆమె వ్యాఖ్యలు చేశారు. అంత మాత్రాన కాపులు మొత్తంగా ఆమెకు మద్దతు పలుకుతారా? అనేది ప్రధాన చర్చ. ఇక్కడే ఓ కీలక విషయం చర్చించాలి.
ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి కూడా ఫైర్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. కానీ, రాజకీయంగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు.. కాపు సామాజిక వర్గంలో పెద్దగా చర్చకు రావడం లేదు. అయితే.. జనసేన గూటిలో ఉన్నారు కాబట్టి.. ఆమెకు అదే రక్షణగా ఉంది. మరి మౌనిక వ్యవహారంఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates