ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది… ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. సంక్షేమ పథకాలు బాగా అమలవుతున్నాయి… ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తవుతున్నాయి… లబ్ధిదారులకు పథకాలన్నీ అందుతున్నాయి… ఇదంతా పైకి కనిపిస్తోంది. అయితే, క్షేత్ర స్థాయిలో కొన్ని గ్యాప్ లు ఉన్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అంతా అద్భుతంగా ఉందని చెబుతున్నా.. కొన్నిచోట్ల గ్యాప్స్ ఉన్నాయని అధికారులకు పవన్ క్లాస్ పీకారు.
ప్రధాని మోదీ సహకారం, ఆయన నాయకత్వం..సీఎం చంద్రబాబు అనుభవంతో ముందుకు పోతున్నామని, ఆర్థిక పరిమితులను దాటి పథకాలు అమలు చేస్తున్నామని పవన్ చెప్పారు. అయితే, పథకాలు, కార్యక్రమాల ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపించాలని, ఆఖరి రూపాయి వరకు సంక్షేమానికి ఖర్చు చేయాలని అన్నారు. అయితే, పైకి అంతా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తోందని… కానీ, కొన్ని లోటుపాట్లు కనిపిస్తున్నాయని చెప్పారు.
ప్రజలకు తాను, చంద్రబాబు జవాబుదారీతనంతో ఉంటున్నామని, క్షేత్రస్థాయిలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించవద్దని సూచించారు. క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు ఎవరికి వారు సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించాల్సిందేనని తేల్చి చెప్పారు.
తాము నాలుగు గోడల మధ్య కూర్చునే వ్యక్తులం కాదని తెలిపారు. అనుకున్న లక్ష్యాలు నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని తేల్చిచెప్పారు. పాలసీలను అమలు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు.
పల్లెపండుగకు రూ.2,500 కోట్లు, అడవితల్లి బాటకు రూ.1,005 కోట్లు, వివిధ పథకాలకు రూ.11,328 కోట్లు, జల్ జీవన్ మిషన్ కు రూ.25 వేల కోట్లు మంజూరయ్యాయని, దాదాపు రూ.10వేల కోట్ల రూపాయల విలువైన పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన వివిధ శాఖల కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పవన్ పాల్గొని మాట్లాడారు. ఈ సమాేవేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ గా పాల్గొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates