ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబును అంబటి బూతులు తిట్టిన వైనంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే అంబటిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని గుంటూరు పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు కూడా చేశారు.
ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు ఆ గొడవపై స్పందించారు. తిరుపతి లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ నివేదికనిచ్చిందని, అయినా సరే టీడీపీ దుష్ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు పెట్టిందని విమర్శించారు.
అవి తీయమని చెప్పినందుకు తనను బూతులు తిట్టారని, దుర్భాషలాడారని, నానా హంగామా చేశారని అన్నారు. తాను చంద్రబాబును బూతులు తిట్టలేదని చెప్పారు. కేవలం తనను తిట్టిన వారినే తాను తిరిగి తిట్టానని, అలా వారిని తిట్టడం కూడా తన అంతరాత్మకు తప్పనిపించిందని అన్నారు.
అయినా సరే, ఆవేశంలో తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని, తిట్టకుండా ఉండాల్సిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. చంద్రబాబు నుంచి ఆదేశం వచ్చిందని, తనను అరెస్ట్ చేస్తారని, ఆ విషయం తనకు తెలుసని చెప్పారు.
అయితే, ఐ డోంట్ కేర్….అరెస్ట్ చేస్తారా.. చేసుకోండి..నేను సిద్ధంగా ఉన్నా అంటూ అంబటి సవాల్ విసిరారు. అయినా, ఏపీలో చట్టం లేదని, అంతా రెడ్ బుక్ పాలనేనని, పోలీస్ రాజ్యంగమే నడుస్తోందని విమర్శించారు. తనను తిట్టి తనపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్టు చేయలేదని, తనపై దాడి జరుగుతుంటే చోద్యం చూస్తూ నిలుచున్నారని ఆరోపించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates