జనసైనికుల మనసు దోచుకున్న నారా లోకేష్

“మనకు అన్నీ బాగున్నప్పుడు అందరూ తోడుంటారు. కానీ కష్టకాలంలో అండగా నిలిచినవారే మనవారు. అలాంటి వారిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు” అని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ మాటలను జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఉదహరిస్తూ ఆయన అనడంతో సభలో ఉన్న విద్యార్థులతో పాటు జనసైనికుల మనసును దోచుకున్నారు.

కాకినాడ జేఎన్‌టీయూలో నిర్వహించిన ‘హలో లోకేష్’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్, వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సూటిగా, ఆత్మీయంగా సమాధానాలు ఇచ్చారు. రాజకీయాలు, పాలన, యువత భవిష్యత్‌తో పాటు వ్యక్తిగత అనుబంధాలపై కూడా లోతైన చర్చ జరిగింది.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో తన అనుబంధంపై ఓ విద్యార్థి ప్రశ్నించగా, లోకేష్ వివరంగా స్పందించారు. 2014 ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారిగా జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్‌ను కలిశానని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆహ్వానంతో జరిగిన డిన్నర్ సమావేశంలో ఆయన్ను ప్రత్యక్షంగా చూడటం అదే మొదటిసారి అని, అంతకుముందు సినిమాల్లో మాత్రమే చూసేవాడినని గుర్తు చేసుకున్నారు.

అప్పటి నుంచి తమ మధ్య స్నేహపూర్వక సంబంధం కొనసాగుతోందని లోకేష్ తెలిపారు. ముఖ్యంగా 2023 సెప్టెంబర్లో చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించిన సమయంలో పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి తమ కుటుంబానికి అండగా నిలిచిన తీరు తన జీవితంలో మరిచిపోలేని ఘటనగా పేర్కొన్నారు.

ఆ సమయంలో పవన్ తనతో మాట్లాడిన విధానం, చూపిన ఆత్మీయత తనను తీవ్రంగా కదిలించిందన్నారు. ఆ సంఘటనను జీవితాంతం గుర్తుంచుకుంటానని లోకేష్ భావోద్వేగంగా చెప్పారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, కష్టసమయంలో మనతో నిలిచిన వారిని గౌరవించడం, వారి విలువను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆయన మాటల్లో నిజాయితీ, ఆత్మీయత కనిపించిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. “ఇంతకాలం రాజకీయ ప్రసంగాలు విన్నాం కానీ ఇలా మనసు తాకే మాటలు చాలా అరుదు”, “మీ మాటలు విన్నాక కళ్లలో తడి చేరింది”, “రాజకీయాలకు అవతల కూడా మనుషుల్లా మాట్లాడగల నేత మీరు” అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.