ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్‌లోనే విచారించాలన్న కేసీఆర్ విజ్ ఒప్తిని ప్రత్యేక విచారణ బృందం (సిట్) అంగీకరించలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని గురువారమే సిట్ నోటీసులు ఇచ్చింది. దీనికి కేసీఆర్ వెంటనే స్పందించారు.
తాను మున్సిపల్ ఎన్నికల వ్యవహారంలో తలమునకలై ఉన్నందున మరో తేదీ ఇవ్వాలని కోరారు. అందుకు సిట్ సుముఖత వ్యక్తం చేసింది. అయితే తాజాగా కేసీఆర్ మరో విన్నపాన్ని సిట్ అధికారుల ముందు ఉంచారు. తనను ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లోనే విచారించాలని కోరారు. అందుకు నిరాకరించిన అధికారులు.. నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో ఆయన్ని విచారించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని కేసీఆర్‌కు 160 సీఆర్పీసీ కింద మరోసారి నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. ఆదివారం మధ్యాహ్నం కేసీఆర్ విచారణ జరగొచ్చని భావిస్తున్నారు. 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు కేసీఆర్. ఇంకో ఐదేళ్ల తర్వాత రెండో పర్యాయం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ప్రభుత్వ ప్రోద్బలంతో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ఫిలిం సెలబ్రెటీలు, ఇంకా వివిధ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. రెండేళ్ల కిందట రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వ్యవహారం మీద ప్రత్యేకంగా దృష్టిసారించింది.
కేసీఆర్, కేటీఆర్ సహా అనేక మంది నాయకులు.. అప్పటి అధికారుల మీద కేసులు పెట్టింది. సుదీర్ఘ కాలంగా ఈ కేసు విచారణ జరుగుతోంది. అనేక మంది నాయకులు, అధికారులను సిట్ బృందం విచారించింది. ఇప్పుడు తొలిసారి కేసీఆర్ ఈ కేసులో విచారణకు హాజరు కాబోతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates