తెలంగాణలో మరో కుంభకోణం జరుగుతోందని బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. దీని వివరాలను త్వరలోనే బయట పెడుతున్నానన్నారు. ఈ కుంభకోణంలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో మైక్రో బ్రూవరీలకు అనుమతులు ఇస్తున్నారని చెప్పిన ఆయన, ఈ క్రమంలో అవినీతి దందాకు తెరదీశారని విమర్శించారు. ముఖ్య నేతకు, మంత్రులకు కూడా దీంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.
రాష్ట్రంలో మైక్రో బ్రూవర్ల ఏర్పాటుకు మొత్తం 110 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 25 దరఖాస్తులకు అనుమతి లభించిందని హరీష్ రావు తెలిపారు. వీటిలో 21 ముఖ్య నేతకు చెందినవని, మరో నాలుగు మంత్రికి సంబంధించినవని ఆయన చెప్పారు. ఎక్సైజ్ శాఖలో అవినీతికి ఇది మరో కోణమని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే బయట పెట్టనున్నట్టు వెల్లడించారు. దీని వెనుక ఏం జరిగిందో కూడా తెలియజేయనున్నట్టు వివరించారు.
ఏంటి బ్రూవర్లు?
బ్రూవర్ అంటే బీరు వంటి వాటిని తయారు చేసే కంపెనీలు. వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. అయితే ఇటీవల కాలంలో మైక్రో బ్రూవర్ కల్చర్ పెరిగింది. అంటే బార్లలో అక్కడికక్కడే తయారు చేసి అందించే బీర్. దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. గోవా తదితర పర్యాటక రాష్ట్రాల్లో మైక్రో బ్రూవరీలకు అనుమతి ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది. పర్యాటకాన్ని ప్రోత్సహించే క్రమంలో మైక్రో బ్రూవరీలను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. దీనిలో భాగంగా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కూడా మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు అనుమతి ఇస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates