మహారాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన సీనియర్ నేత అజిత్ పవార్.. ఈ రోజు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రైవేట్ జెట్ ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఒక సంచలనం. ఆ రాష్ట్రానికి ఆయన ఆరుసార్లు డిప్యూటీ సీఎంగా పని చేయడం విశేషం.
తన చాణక్యంతో అనేకసార్లు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన అజిత్.. ముఖ్యమంత్రి కావాలన్న కలను మాత్రం నెరవేర్చుకోకుండానే కన్నుమూశారు. రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్.. అజిత్‌కు పెదనాన్న.. రాజకీయ గురువు. మొదట కాాంగ్రెస్ పార్టీలో ఉన్న అజిత్ పవార్.. శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడంతో అందులోకి వెళ్లిపోయారు. ఆ పార్టీ కీలక నేతగా ఎదిగారు.
కానీ తన రాజకీయ గురువునే ధిక్కరించాల్సిన పరిస్థితి వచ్చింది. 2004లో ఎన్సీపీకి మెజారిటీ సీట్లు వచ్చినప్పటికీ.. సీఎం పదవిని మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తన పెదనాన్నతో విభేదించి.. పార్టీని చీల్చారు. భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపారు.
కానీ రెండు రోజులకే దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వం కూలడంతో మళ్లీ శరాద్ పవార్ వద్దకే చేరుకున్నారు. తర్వాత ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని కూటమిలోకి వెళ్లారు. ఆ కూటమి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఆ ప్రభుత్వం రెండున్నరేళ్లకు కూలిపోగా.. 2022లో ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వంలో అజిత్ డిప్యూటీ సీఎం అయ్యారు.
ఆయన అంతకుముదు 2010లో, 2012లోనూ రెండుసార్లు డిప్యూటీ సీఎంగా పని చేశారు. 2024 ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించింది. అప్పుడు అజితే సీఎం అవుతారని వార్తలు వచ్చాయి. ఆయనకు కూడా ఆ పదవి చేపట్టడం కల. కానీ ఫడ్నవీసే అప్పుడు సీఎం అయ్యారు. ఇంకో పర్యాయం అయినా తనకు ముఖ్యమంత్రి పదవి వస్తుందని ఆశించిన అజిత్.. ఇప్పుడు ఆ కల తీరకుండానే ప్రాణాలు వదిలారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates