జనసేన ఎమ్మెల్యేపై యాక్షన్

జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ం పై వచ్చిన లైంగిక ఆరోపణల వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. జనసేనపై వైసీపీ నేతలు మాటల దాడికి దిగారు. బాధిత మహిళ స్వయంగా వచ్చి తనను బెదిరించి లోబరుచుకున్నాడు అని ఆరోపణలు చేస్తున్నప్పటికీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదు అని వైసీపీ మహిళా నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే అరవ శ్రీధర్ పై జనసేన చర్యలు తీసుకుంది. ఆ ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు జనసేన కార్యక్రమాలకు అరవ శ్రీధర్ దూరంగా ఉండాలని ఆదేశించింది.

ఆ ఆరోపణలపై ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు జనసేన రాష్ట్ర కమిటీ ఓ లేఖ విడుదల చేసింది. అరవ శ్రీధర్ పై మీడియాలో వచ్చిన వార్తలు, ఒక మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని నిర్ణయించింది.

టి.శివశంకర్, శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి, టి.సి.వరుణ్ లతో ముగ్గురు సభ్యుల కమిటీ వేశామని తెలిపింది. అంతేకాదు, 7 రోజుల్లోగా కమిటీ ముందు అరవ శ్రీధర్ హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆ ఆరోపణలపై విచారణ జరిపిన తర్వాత పార్టీకి కమిటీ నివేదిక అందిస్తుందని వెల్లడించింది. ఇక, ఆ నివేదిక పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే వరకూ అరవ శ్రీధర్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది