‘కూటమిలో ఇబ్బందులు సరే.. అయినా కలిసి ఉండాల్సిందే’

పార్టీ అధినేత ఒక లక్ష్యం నిర్దేశించుకున్నారు. దానిని ముందుకు తీసుకువెళ్లడం మనందరి బాధ్యత. ఈ క్రమంలో అనేక ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికే చాలా ఉన్నాయి. అవన్నీ నేను కూడా ఒప్పుకుంటున్నా. అయినా కూటమిగా ముందుకు వెళ్లాల్సిందే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ తేల్చి చెప్పారు.

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలు, కార్యకర్తలకు నిర్వహించిన శిక్షణ శిబిరంలో నారా లోకేష్ కీలక ప్రసంగం చేశారు. వాస్తవానికి లోకేష్ ప్రసంగిస్తున్న సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు అక్కడే ఉన్నారు.

చంద్రబాబు మౌనం

యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న సంకల్పంతో చంద్రబాబు మౌనంగా కూర్చుని, అందరిమాదిరిగానే నారా లోకేష్ ప్రసంగాన్ని విన్నారు. ఆయన ఎక్కడా ప్రసంగించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.

15 ఏళ్ల లక్ష్యం

లోకేష్ మాట్లాడుతూ వచ్చే 15 ఏళ్లపాటు రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలో ఉండాలన్నది అధినేత లక్ష్యమని చెప్పారు. ఇది ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదని స్పష్టం చేశారు. అందరూ సమష్టిగా కృషి చేస్తేనే సాధ్యమవుతుందన్నారు.

క్షేత్రస్థాయిలో కూటమిలో ఉన్న సమస్యలు తనకు కూడా తెలుసునని పేర్కొంటూ, అలాంటివి ఉంటేనే కూటమి అంటారని చమత్కరించారు. వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగాలని సూచించారు.

గత ఎన్నికల ఉదాహరణ

గత ఎన్నికల సమయంలో కూటమి సాధ్యం కాదని అనుకున్నారని, కానీ అది సాకారం అయిందని గుర్తు చేశారు. దానిని కొనసాగించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని లోకేష్ తెలిపారు.

ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. ఒక కుటుంబంలోనే విభేదాలు ఉంటాయి. అలాంటిది విభిన్న నేపథ్యాలు, సిద్ధాంతాలు ఉన్న పార్టీల కూటమిలో సమస్యలు ఉండవని ఎవ్వరూ అనుకోరు. వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలి అని అన్నారు.

ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలను పార్టీ పార్లమెంటరీ బాధ్యుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని, అవసరమైతే సీఎం చంద్రబాబుతో చర్చించాలన్నారు.

చంద్రబాబుతో పని చేయడం కష్టం

చంద్రబాబుతో కలిసి పని చేయడం చాలా కష్టమని లోకేష్ వ్యాఖ్యానించారు. ఆయన దగ్గర మార్కులు వేయించుకోవాలంటే బాగా కష్టపడాల్సి ఉంటుందని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత శ్రమించాలని పిలుపునిచ్చారు.

కష్టపడిన వారికి, సంస్థాగతంగా పార్టీలో పనిచేసిన వారికి పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు.

శిక్షణ కేంద్రాల ఏర్పాటు

పార్టీ కార్యకర్తల శిక్షణ కోసం మూడు ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు లోకేష్ తెలిపారు. విశాఖ, అమరావతి, తిరుపతిలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి నిరంతర శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు.