లైంగిక ఆరోపణలపై స్పందించిన జనసేన ఎమ్మెల్యే

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ వివాహిత సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనను ఏడాదిన్నరగా అరవ శ్రీధర్ లైంగికంగా వేధిస్తున్నారని ఆమె ఓ మీడియా ఛానెల్ లో ఆరోపించారు. తనతో అరవ శ్రీధర్ నగ్నంగా వీడియో కాల్ మాట్లాడరని ఆరోపించారు. దీంతో, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఆ ఆరోపణలపై అరవ శ్రీధర్ స్పందించారు.

డీప్ ఫేక్ వీడియోలతో తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, ఆ ఆరోపణలు అవాస్తవమని ఖండించారు. అంతేకాదు, 2021 నుంచి మూడేళ్ల పాటు సర్పంచ్ గా పని చేశానని, ఏ రోజూ తనపై ఎటువంటి ఆరోపణలు రాలేదని గుర్తు చేశారు. గత 6 నెలల నుంచి తనను ఇదే మాదిరిగా వేధిస్తున్నారని తన తల్లి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారని వెల్లడించారు. తనపై కుట్ర చేసిందెవరో విచారణలో తేలుతుందని, న్యాయపరంగా కోర్టులోనే ఈ విషయాన్ని తేల్చుకుంటానని చెప్పారు.

అంతకుముందు, అరవ శ్రీధర్ తల్లి కూడా మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు ఉత్తముడని, కావాలనే కొందరు తన బిడ్డపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తన కొడుకు రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేక ఈ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ తరహా వేధింపులపై తాను ఆల్రెడీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశానని ఆమె చెప్పారు.