వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య.. ఉరఫ్ నానిపై మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. గత 18 నెలల కాలంలో పేర్నిపై నమోదైన కేసుల్లో ఇది 6వది కావడం గమనార్హం. గతంలో బియ్యం అక్రమ నిల్వ, విక్రయాలకు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయి.
తర్వాత.. పోలీసులపై దురుసుగా వ్యవహరించిన కేసులు రెండు ఉన్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరో కేసు నమోదైంది. ఈ క్రమంలో విచారణకు పిలిచే అవకాశం ఉంది.
ఏం జరిగింది..?
ఉమ్మడి కృష్నాజిల్లాలోని మచిలీపట్నంలోని ఇనకుదురు సర్కిల్‌లో ఇటీవల దివంగత వైఎస్ రాజశేఖరెడ్డి విగ్రహాన్ని మాజీ మంత్రి పేర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రాజశేఖరరెడ్డి మృతి చెందితే.. విగ్రహాలు పెట్టారని.. ఆయన ప్రజలకు దేవుడని వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేసి చనిపోయాడని అన్నారు. అందుకే ఇంటింటా కూడా ఆయన ఫొటోలు.. వీధి వీధికీ ఆయన విగ్రహాలు పెట్టారని తెలిపారు. ఇదే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు భవిష్యత్తులో ఎవరూ విగ్రహాలు కూడా పెట్టరని అన్నారు.
అంతేకాదు.. అసలు వారిని ఎవరూ తలుచుకోను కూడా తలుచుకోరని పేర్ని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కూటమి పార్టీల్లో తీవ్ర దుమారం రేపాయి. దీనిపై అప్పట్లోనే మచిలీపట్నం టీడీపీ నాయకుడు, జనసేన నాయకులు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు.. మాజీ మంత్రి పేర్నిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఇనకుదురు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పేర్నిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆయనను విచారణకు పిలిచే అవకాశం ఉంది. కాగా.. ఈ వ్యవహారంపై జనసేన నాయకులు స్పందిస్తూ.. పేర్ని లాంటి వారు సమాజానికి చీడ పురుగులని వ్యాఖ్యానించారు. మచిలీపట్నంలో ఉండే అర్హత కూడా పేర్నికి లేదన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates