షర్మిల ఢిల్లీ ప్రయాణం వెనుక ఇంత కథ ఉందా?

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలిగా ఉన్న వైఎస్ ష‌ర్మిల‌.. రాజ్య‌స‌భ‌కు వెళ్తారంటూ కొన్నాళ్లుగా ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. 2024 ఫిబ్ర‌వ‌రిలో ఆమె ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాల‌ను చేప‌ట్టారు. అనంత‌రం.. అదే ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో క‌డ‌ప నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. త‌న సోద‌రుడు, వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌భుత్వం దిగిపోవ‌డంలో ష‌ర్మిల కీల‌క పాత్ర పోషించార‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు విశ్లేషిస్తారు. అప్ప‌ట్లో ఊరూ వాడా తిరిగి వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్యతో పాటు ఆస్తుల వివాదాల‌ను కూడా ఆమె ప్ర‌చారం చేశారు.

ఈ క్ర‌మంలోనే కీల‌క‌మైన ఓటు బ్యాంకు వైసీపీకి దూర‌మైంద‌న్న చ‌ర్చ ఉంది. ఇదిలావుంటే.. ష‌ర్మిల ఆనాటి ఎన్నిక‌ల్లో క‌డ‌ప పార్ల‌మెంటు స్థానం నుంచి పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు. డిపాజిట్ కూడా ద‌క్కించుకోలేక పోయారు. ఇక‌, రాష్ట్ర వ్యాప్తంగా 128 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దింపినా.. ఒక్కరూ విజ‌యం ద‌క్కించుకోలేక పోయారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. త‌ర‌చుగా ఏపీ స‌మ‌స్య‌లు, ముఖ్యంగా సోద‌రుడు జ‌గ‌న్‌పైనా విమ‌ర్శ‌లు గుప్పించ‌డం వ‌ర‌కు ష‌ర్మిల ప‌రిమితం అవుతున్నారు. ఇదిలావుంటే.. పార్టీ సీనియ‌ర్ల నుంచి ఆమెకు సెగ త‌గులుతోంది.

కాంగ్రెస్ పార్టీ లైన్‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. ఆమెను అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌న్న డిమాండ్లు కూడా తెర‌మీదికి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలోనే.. ష‌ర్మిల‌కు గ‌తంలో అంటే.. 2024లోనే క‌డ‌ప ఎంపీగా పోటీకి దిగిన‌ప్పుడు.. ఓడితే రాజ్య‌స‌భ‌కు పంపిస్తామ‌ని.. కాంగ్రెస్ అధిష్టానం భ‌రోసా క‌ల్పించింద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు ఆ క్ర‌మంలోనే ఆమెను రాజ్య‌స‌భ‌కు పంపిస్తున్నార‌ని ఢిల్లీ పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. తాజాగా మంగ‌ళ‌వారం రాహుల్‌గాంధీ నుంచి వ‌చ్చిన పిలుపు మేర‌కు.. ష‌ర్మిల హుటాహుటిన ఢిల్లికి వెళ్లి ఆయ‌న‌తో సుదీర్ఘంగా చ‌ర్చించారు.

త్వ‌ర‌లోనే క‌ర్ణాట‌క‌, తెలంగాణ రాష్ట్రాల‌లో రాజ్య‌స‌భ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఇత‌ర రాష్ట్రాల్లోనూ ఖాళీ అవుతున్నా.. అక్క‌డ కాంగ్రెస్‌కు బ‌లం లేదు. ఈ నేప‌థ్యంలో కర్ణాట‌క‌, లేదా తెలంగాణ కోటా నుంచి ష‌ర్మిల‌ను పెద్ద‌ల స‌భ‌కు పంపించేందుకు కాంగ్రెస్ ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని స‌మాచారం. అనంత‌రం.. ఏపీకి సంబంధించి ఓ కీల‌క కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన మాజీ అధికారికి కాంగ్రెస్ ప‌గ్గాలు అప్ప‌గించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఆయ‌న గ‌తంలోనే సొంత పార్టీ పెట్టుకున్నారు. అయితే.. అది స‌క్సెస్ కాలేదు. ఈ నేప‌థ్యంలో త‌న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. ఏపీ కాంగ్రెస్ ప‌గ్గాల కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు.