రాజధానికి మువ్వన్నెల శోభ

అమరావతి రాజధాని పరిధిలోని కోర్ క్యాపిటల్ ఏరియాలో తొలిసారిగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పచ్చదనం, సుందర ప్రాంగణాలు, అత్యుత్తమ మౌలిక వసతులతో అభివృద్ధి చేసిన ఈ ప్రాంతం వేడుకలకు మరింత శోభను ఇచ్చింది. ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించే ఈ వేడుకలు పాల్గొన్న వారందరికీ మరిచిపోలేని అనుభూతిని అందించింది.

ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు, గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు, రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు తదితరులు అతిథులుగా పాల్గొననున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతిబింబించేలా వివిధ శాఖలకు చెందిన 22 శకటాలను ప్రదర్శించారు. వీటిలో వందేమాతరం – 150 వసంతాలు, జీరో పావర్టీ, నైపుణ్యం–ఉపాధి, నీటి భద్రత, వ్యవసాయ–సాంకేతికత, ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్, శక్తి–ఇంధన ఖర్చు తగ్గింపు, చేనేత–జౌళి, స్వచ్ఛ ఆంధ్ర, డీప్ టెక్ వంటి ఇతివృత్తాలతో శకటాలను రూపొందించారు.

2014లో రాజధానిగా ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు అక్కడ ఈ వేడుకలు నిర్వహించలేకపోయారు. పరిపాలనా మార్పులు, రాజధాని అభివృద్ధిలో జాప్యం, మౌలిక వసతుల లేమి ఇందుకు కారణాలయ్యాయి. ఈ ఏడాది ఇక్కడ గణతంత్ర వేడుకలు నిర్వహించడంతో రాజధాని రైతుల్లో ఆనందం నెలకొంది.