తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా బీఆర్ ఎస్ ముఖ్య నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారించారు. సుమారు 7 గంటలపాటు విచారించిన తర్వాత.. ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు.
ఆ వెంటనే కొన్ని మీడియా ఛానెళ్లలో ఈ విచారణ పై వార్తలు వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది చట్ట విరుద్ధం కాదని, భద్రతా పరమైన కారణాలతోనే గతంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పేర్కొంటూ వార్తలను ప్రసారం చేశాయి. దీనిలో విచారించేందుకు కూడా ఏమీలేదని పేర్కొనడం విశేషం.
అయితే టీవీల్లో వచ్చిన ప్రచారంపై వెంటనే హైదరాబాద్ పోలీసు కమిషనర్, ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్న అధికారిగా సజ్జనార్ స్పందించారు. ఆ వార్తలు నిరాధారమని పేర్కొన్నారు. వ్యాపారులు, నాయకులు, ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారని.. ఇది వ్యవస్థీకృత నేరమని.. చట్ట విరుద్ధమని పేర్కొన్నారు.
ఇదేమీ కాకతాళీయంగా జరిగింది కాదని తెలిపారు. చాలా ఉద్దేశపూర్వకంగానేఫోన్ ట్యాపింగ్ చేశారని తెలిపారు. దీనిపై అన్ని కోణాల్లోనూ తమకు ఆధారాలు ఉన్నాయని.. అందుకే నిశితంగా విచారిస్తున్నామని పేర్కొన్నారు. కానీ, కొందరు తప్పుదోవ పట్టించేలా దీనిపై ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
కేటీఆర్‌ను విచారించిన అంశంపై స్పందిస్తూ.. ఆయనను అన్ని కోణాల్లోనూ నిశితంగా విచారించామని సజ్జనార్ తెలిపారు. ఆయన తమను ప్రశ్నించడం అనేది సరికాదన్నారు.(నేనే సిట్‌కు కొన్ని ప్రశ్నలు వేశా.. అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు) అనధికారికంగా.. చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారనేది వాస్తవమని పేర్కొన్నారు.
దీనిపై అన్ని ఆధారాలను సేకరిస్తున్నామని .. చట్ట ప్రకారం వ్యవహరిస్తున్నామని సజ్జనార్ పేర్కొన్నారు. దీనిపై జరిగే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను ఆయన కోరారు. ఏదైనా ఉంటే చట్ట ప్రకారం.. అందుకు బాధ్యులైన అధికారులే చెబుతారని.. ఎవరు పడితే వారు.. ఏది చెబితే అది నమ్మొద్దని సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates