టీడీపీ ఫ్యాన్స్ కి కిక్కిచ్చిన తారక్!

​రాజకీయాలకు దూరంగా ఉంటూ, తన ఫోకస్ అంతా సినిమాల మీదనే పెట్టిన జూనియర్ ఎన్టీఆర్, లేటెస్ట్ గా చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు అటు పొలిటికల్ సర్కిల్స్‌లో, ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా టీడీపీకి అలాగే నారా కుటుంబానికి తారక్ దూరంగా ఉంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

నందమూరి-నారా కుటుంబాల మధ్య గ్యాప్ ఉందంటూ వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ, నేడు ఏపీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ స్పందించిన తీరు ప్రాధాన్యత సంతరించుకుంది.

​జనవరి 23న నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని, ఉదయాన్నే ఎన్టీఆర్ తన ‘X’ (ట్విట్టర్) ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. “నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. రాబోయే ఏడాది మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ ఆయన చేసిన ట్వీట్ టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాజకీయంగా ఎలాంటి కామెంట్స్ చేయనప్పటికీ, ఇలాంటి పర్సనల్ విష్‌లతో తన బంధాన్ని ఆయన నిలబెట్టుకుంటున్నారు.

​సాధారణంగా ఎన్టీఆర్ పొలిటికల్ ఇష్యూస్‌కు చాలా దూరంగా ఉంటారు. ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత కూడా చాలా సెలెక్టివ్‌గా స్పందించారు. నారా వారితో గ్యాప్ ఉందంటూ నిత్యం వార్తలు వస్తున్నప్పటికీ, కుటుంబ సభ్యుల మధ్య మంచి చెడులు జరిగినప్పుడు మాత్రం వెనకాడటం లేదు. తాజాగా లోకేష్‌కు విష్ చేయడం ద్వారా, తమ మధ్య ఉన్నది కేవలం వ్యక్తిగత గౌరవం మాత్రమేనని, వివాదాలకు తావులేదని పరోక్షంగా హింట్ ఇచ్చారు.

​ఈ ట్వీట్ చూసిన టీడీపీ అభిమానులు, నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా యంగ్ టైగర్ నుండి ఇలాంటి రెస్పాన్స్ రావడంతో, ఇది ఒక పాజిటివ్ వైబ్‌ను క్రియేట్ చేసింది. తారక్ తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, తన మూలాలను బంధుత్వాలను మర్చిపోరని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి ఎన్టీఆర్ చేసిన ఈ చిన్న ట్వీట్, గత కొన్నాళ్లుగా సాగుతున్న ఎన్నో చర్చలకు తెరదించింది. గాసిప్స్ ఎలా ఉన్నా, ఒక మంత్రిగా, బావగా లోకేష్‌కు ఆయన అందించిన శుభాకాంక్షలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.