‘ఎన్ని పాదయాత్రలు చేసినా జగన్ సీఎం కాలేరు’

ఎన్ని పాదయాత్రలు చేసినా జగన్ సీఎం కాలేరు.. వైసీపీ అధికారంలోకి రాదు అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గెలిచి చెప్పారు.. అందుకు కారణం కూడా ఆయన వివరించారు. కోటరీని నమ్ముకున్నంత కాలం జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు.

లిక్కర్ స్కామ్ లో విచారణ అనంతరం ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. జగన్ రాజకీయంగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తేనే ఆయన తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. 

జగన్ చుట్టూ కోటరీ ఉందంటూ విజయసాయి వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. తాను రాజీనామా చేసినప్పుడు నుంచి ఇప్పటివరకు చాలా సందర్భాల్లో ఆయన జగన్ కోటరీ పై నిప్పులు చెరుగుతున్నారు. మొన్నటికి మొన్న అమ్ముడు పోయిన “కోటరీల” మధ్య “బందీలుగా” ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండి. భవిష్యత్తులో ఇక్కడ మీకూ ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి! .. అంటూ సంచలన ట్వీట్ చేసి చర్చకు తెరలేపారు.

ఇప్పుడు జగన్ అధికారంలోకి రావడానికి ఆ కోటరీ అడ్డు అంటూ మరోసారి సంచలన ప్రకటన చేశారు. తాను ఏ పార్టీలో చేరబోను అని చెబుతున్న విజయసాయి.. జగన్ తన చుట్టూ ఉన్న కోటరీని తప్పిస్తే మళ్లీ వైసీపీలోకి వెళ్తారా..? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.

మొత్తం మీద విజయసాయి తీవ్ర ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో లాభాలన్నీ కోటరీ లో ఉన్నవారికి, కేసులు మాత్రం తన పైకి అని ఆయన ఈరోజు విలేకరుల సమావేశంలో చెప్పటం ఆయనలో ఉన్న బాధకు అర్థం పడుతుంది.

జగన్ నమ్మిన బంటుగా ఉన్న విజయసాయి ఇప్పుడు ఏకంగా ఆయన అధికారంలోకి ఎందుకు రాలేడనే కారణాలు చెబుతున్నారు. త్వరలో జగన్ పాదయాత్ర చేస్తారు.. వాటిలో కొంత ఊపు వస్తుంది అని భావిస్తున్న వారికి విజయసాయి పదేపదే చేస్తున్న వ్యాఖ్యలు ఆలోచనలో పడేస్తున్నాయి.