ఐ-ప్యాక్ ‘మిస్టరీ’ లోన్: రూ.13.5 కోట్ల అసలు కథేంటి?

ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్ (I-PAC) ఆర్థిక లావాదేవీలపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. 2021లో ఈ సంస్థ హర్యానాలోని రోహ్‌తక్ కేంద్రంగా ఉన్న ఒక కంపెనీ నుంచి రూ. 13.5 కోట్ల అన్‌సెక్యూర్డ్ లోన్ పొందినట్లు తన ఆర్థిక నివేదికల్లో పేర్కొంది. అయితే, ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆ అప్పు ఇచ్చిన కంపెనీ మూడేళ్ల ముందే మూతపడిపోవడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.

ఐ-ప్యాక్ తన ఫైలింగ్స్‌లో లోన్ ఇచ్చిన సంస్థ పేరును ‘రామసేతు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియా (పి) లిమిటెడ్’ అని పేర్కొంది. కానీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC) డేటాలో ఈ పేరుతో ఎలాంటి యాక్టివ్ సంస్థ కనిపించడం లేదు. దానికి దగ్గర పేరుతో ఉన్న ‘రామ్ సేతు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ అనే కంపెనీ రికార్డులను పరిశీలిస్తే, అది 2013లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కేవలం 5 లక్షల మూలధనంతో ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ రామ్ సేతు కంపెనీ తన కార్యకలాపాలను నిర్వహించడంలో విఫలం కావడంతో కంపెనీల చట్టం ప్రకారం 2018 ఆగస్టు 18 నాడే ప్రభుత్వం దానిని రద్దు చేసింది. అంటే అధికారికంగా ఉనికిలో లేని కంపెనీ నుంచి ఐ-ప్యాక్ సుమారు మూడు ఏళ్ల తర్వాత 2021లో 13.5 కోట్ల భారీ రుణాన్ని ఎలా పొందిందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.

ఈ విషయంపై లోతుగా ఆరా తీయగా మరిన్ని ఆసక్తికర విషయాలు బయటపడుతున్నట్లు తెలుస్తోంది. సదరు కంపెనీ కాంటాక్ట్ నంబర్‌కు ఫోన్ చేస్తే, అది తనది కాదని ముఖేష్ అనే వ్యక్తి సమాధానమిచినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అలాగే ఆ కంపెనీకి గతంలో యజమానులుగా ఉన్న వ్యక్తులు కూడా తమకు ఐ ప్యాక్ తో ఎలాంటి సంబంధం లేదని, అసలు లోన్ ఇవ్వడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. ఐ-ప్యాక్ ఇప్పటికే ఈ రుణంలో కొంత భాగాన్ని తిరిగి చెల్లించినట్లు రికార్డులు చెబుతున్నా, అసలు అప్పు ఇచ్చిన సంస్థ గుర్తింపుపై క్లారిటీ లేదు.

ఐ-ప్యాక్ సమర్పించిన నివేదికలకు, ప్రభుత్వ రికార్డులకు మధ్య ఉన్న ఈ భారీ వ్యత్యాసం నిధుల మూలంపై అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? నివేదికల్లో తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చారు? అనే ప్రశ్నలపై ఐ-ప్యాక్ ఇప్పటి వరకు ఎలాంటి బహిరంగ వివరణ ఇవ్వలేదు. ఈ ఆర్థిక లావాదేవీల వెనుక ఉన్న అసలు రహస్యం దర్యాప్తులో తేలాల్సి ఉంది.