బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కవిత సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఆమె తాను అధ్యక్షురాలిగా ఉన్న తెలంగాణ జాగృతి సంస్థనే పార్టీగా మార్చనున్నారని తెలుస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున కసరత్తునుకూడా పూర్తి చేశారు. ఇదిలావుంటే.. కవిత తరచుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా తన సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్ సహా.. మాజీ మంత్రి, కేసీఆర్ మేనల్లుడు హరీష్‌రావును కూడా ఆమె తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా కూడా కేటీఆర్‌పై నిప్పులు చెరిగారు.
సేవ్ సికింద్రాబాద్ పేరుతో బీఆర్ఎస్ నాయకులు ఉద్యమించడాన్ని కవిత తీవ్రంగా తప్పుబట్టారు. అదికారంలో ఉన్నప్పుడు.. ఇదే నినాదంతో ఉద్యమించిన వారిని జైల్లో పెట్టారంటూ.. నిప్పులు చెరిగారు. అదేసమయంలో ఇతర నాయకులపై కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే.. ఇంత జరుగుతున్నా.. కవితపై బీఆర్ఎస్ మాత్రం పన్నెత్తు మాట అనడం లేదు. ఆమె సంధించిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పడం లేదు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు తాజాగా ప్రశ్నించారు. కవితకు సమాధానం చెప్పుకొనే పరిస్థితిలో కూడా బీఆర్ఎస్ నాయకులు లేరంటూ ఎద్దేవా చేశారు.
అయితే.. బీఆర్ఎస్ ఎందుకిలా చేస్తోంది? అనేది ప్రశ్న. గతంలో బీఆర్ఎస్ నుంచి కవితను బహిష్కరించలేదు. కేవలం సస్పెండ్ మాత్రమే చేశారు. సో.. అప్పట్లో ఆమె విమర్శలు చేసినా.. తిరిగి ఎలానూ తమ గూటికి చేరుతారన్న ఉద్దేశంతో ఆమెను పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని కేసీఆర్ కూడా పార్టీ నాయకులకు సూచించారు. ఎప్పటికైనా కవిత మన మనిషి అంటూ.. ఆయన వ్యాఖ్యానించారు. దీంతో అప్పట్లో విమర్శలు చేసినా ఎవరూ పెద్దగా రియాక్ట్ కాలేదు. కానీ, ఇప్పుడు బీఆర్ఎస్‌తోనే కాదు.. కుటుంబంతోనే సంబంధాలు తెంచుకున్నానని కవిత చెబుతున్నారు.
ఈ క్రమంలోనే సూటిపోటి విమర్శలు చేస్తున్నారు. కామెంట్లు కుమ్మేస్తున్నారు. అయినా.. కూడా బీఆర్ఎస్ నాయకులు ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నది ప్రశ్న. దీనికి ప్రధాన కారణం..
1) సెంటిమెంటు: కవితను టార్గెట్ చేసుకుంటే.. అది ఆమెకు అందించిన సెంటిమెంటు అస్త్రంగా మారుతుందన్న వాదన బీఆర్ఎస్ వర్గాలలో ఉంది. తెలంగాణ సమాజంలో ఆడబిడ్డకు ఇచ్చే గౌరవం ప్రత్యేకంగా ఉంటుంది. పైగా కేసీఆర్ తనయ కావడంతో ఆమెను విమర్శిస్తే.. సెంటిమెంటుగా ఆమె వాడుకునే ప్రయత్నం చేస్తారు. దీంతో నాయకులు విమర్శలకు దూరంగా ఉంటున్నారు.
2) రాజకీయం: కవిత ప్రశ్నలకు, విమర్శలకు స్పందిస్తే.. అనవసరంగా ఆమెను పెద్దనేతను చేసినట్టేనని కేసీఆర్ ఇటీవల జరిగిన అంతర్గత సమావేశంలో చెప్పారు. ఈ రెండు కారణాలతోనే కవితను బీఆర్ఎస్ నాయకులు పట్టించుకోవడం లేదన్నది సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates