విచారణ వేళ విజయసాయి ట్వీట్‌… బీజేపీపై ప్రశంసలు!

ఏపీ లిక్కర్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కోనున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తన ట్వీట్లతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశారు. ఇటీవల ‘కోటరీలు’, ‘వెనిజులా అధ్యక్షుడు’ అంటూ చేసిన ట్వీట్‌ ద్వారా వైఎస్ జగన్‌ను ఉద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్తమైంది. కోటరీల ప్రస్తావన ఇది తొలిసారి కాకపోవడంతో, ఆయన ఎవరిని ఉద్దేశించారన్న దానిపై రాజకీయంగా విస్తృత చర్చ సాగింది.

ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబిన్‌కు అభినందనలు తెలుపుతూ విజయసాయి మరో ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీకి నాయకత్వం వహించడం గొప్ప బాధ్యత అని, కేంద్రంతో పాటు 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీకి ఆయన మార్గదర్శనం చేయనున్నారని పేర్కొన్నారు. బీజేపీకి ఇప్పటివరకు అతి పిన్న వయసు అధ్యక్షుడిగా నితిన్ నబిన్ పార్టీకి మేలు చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

అయితే మరో రెండు రోజుల్లో లిక్కర్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కోనున్న సమయంలో బీజేపీపై ప్రశంసల వర్షం కురిపించటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో విజయసాయి నిందితుడిగా ఉండటం గమనార్హం. ఇదే సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఇటీవల ఢిల్లీలో మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో సంచలనాలు చోటుచేసుకుంటాయని వ్యాఖ్యానించటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో విజయసాయి ట్వీట్ వెనక అసలు ఉద్దేశం ఏమిటి? లిక్కర్ కేసుతో దీనికి ఏమైనా సంబంధముందా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.