నైనీ వివాదంపై ‘సీబీఐ విచారణ’ కోసం డిమాండ్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ ఎస్ నాయ‌కుల మాటల దాడి ఆగ‌డం లేదు. రెండు రోజుల కింద‌ట బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌.. కేటీఆర్‌.. సీఎం రేవంత్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. తుగ్ల‌క్ సీఎం అంటూ వ్యాఖ్యానించారు. ఆయ‌న ఏం చేస్తున్నాడో ఆయ‌న‌కే తెలియ‌డం లేద‌న్నారు. ఇక‌, తాజాగా అదే పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి హ‌రీష్‌రావు కూడా సీఎంపై విరుచుకుప‌డ్డారు.

`ఔట్ సోర్సింగ్ సీఎం` అంటూ కామెంట్లు చేశారు. గ‌త రెండు రోజులుగా రాష్ట్రంలో జ‌రుగుతున్న మీడియా వార్‌పై స్పందించిన హ‌రీష్‌రావు.. అస‌లు సిస‌లు కాంగ్రెస్ వాదుల‌కు.. ఔట్ సోర్సింగ్ ముఖ్య‌మంత్రికి మధ్య తెర‌వెనుక పంచాయ‌తీ న‌డుస్తోంద‌ని చెప్పారు. ఇందులో భాగంగానే నైనీ బొగ్గుగ‌నుల వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చింద‌న్నారు. తెలంగాణ ప్ర‌జ‌లు త‌మ క‌ష్టాలు తీర్చ‌మ‌ని ఓట్లు వేసి గెలిపిస్తే.. వీరు వాటాల కోసం త‌న్నుకుంటున్నార‌ని హ‌రీష్‌రావు అన్నారు.

నైనీ బొగ్గుగ‌నుల వ్య‌వ‌హారంలో ఏదో జ‌రుగుతోంద‌ని ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో అస‌లు నైనీ బొగ్గుగనుల పై సీబీఐతో విచార‌ణ జ‌రిపించాల‌ని హ‌రీష్‌రావు డిమాండ్ చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలను అమ‌లు చేయ‌డంలో స‌ర్కారు పూర్తిగా విఫ‌ల‌మైంద‌న్నారు. ఇప్పుడు వాటాలు పంచుకునేందుకు కొట్టుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. దీనిపై నిజానిజాలు తేలాలంటే.. సీబీఐకి ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఔట్ సోర్సింగ్ సీఎంకు.. అస‌లు సిస‌లు కాంగ్రెస్ వాదుల‌కు కోల్డ్ వార్ జ‌రుగుతోంద‌ని వ్యాఖ్యానించారు.

ఇదిలావుంటే.. నైనీ బొగ్గుగ‌నుల కేటాయింపును నిలిపివేయాల‌ని కేంద్రానికి లేఖ రాసిన‌ట్టు.. మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. దీనిలో ఎలాంటి వివాదం లేద‌న్నారు. అయితే.. ఉద్దేశ పూర్వకంగానే త‌మ మంత్రుల మ‌ధ్య వివాదం సృష్టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇదే విష‌యంపై సీఎం రేవంత్ కూడా స్పందించారు. త‌మ మ‌ధ్య ఎలాంటివివాదాలు లేవ‌న్నారు. మీడియా సంస్థ‌ల మ‌ధ్య ఏదైనా పంచాయ‌తీ ఉంటే.. తలుపులు వేసుకుని త‌న్నుకోవాల‌ని ఎద్దేవా చేశారు.