తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేయించారని ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు.
ఈ కేసు విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది. ప్రభాకర్ రావుతో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలను సిట్ అధికారులు విచారణ జరిపారు.
ఈ క్రమంలోనే తాజాగా ఆ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావుకు సిట్ అధికారులు షాకిచ్చారు. హరీశ్ రావుకు సిట్ అధికారులు కొద్ది సేపటి క్రితం నోటీసులిచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారణ జరిపేందుకు అనుమతివ్వాలని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.
తన ఫోన్‌ను ట్యాప్ చేయించారంటూ హరీష్ రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా దానిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా….ఆ కేసును హైకోర్టు కొట్టివేసింది.
అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోబోమని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో హరీశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి, హరీశ్ రావు విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
