Big News: ఓవైసీతో కమల్ హాసన్ దోస్తీ?

ఇది ఎవ్వరూ ఊహించని కలయికే. తమిళ నాట రాజకీయ శక్తిగా ఎదగాలని చూస్తున్న కమల్ హాసన్.. ఒక మతానికి ముఖచిత్రంగా, ప్రతినిధిగా మారిన పార్టీతో దోస్తీ కట్టబోతున్నారట. ఆ పార్టీ.. హైదరాబాద్ పరిధిలో తిరుగులేని ఆదరణ ఉన్న ఎంఐఎంయేనట. హైదరాబాద్‌లో బలమైన పార్టీగా ఎదిగిన ఎంఐఎం.. దేశవ్యాప్తంగా ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలన్నింటికీ పార్టీని విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడ ముస్లింలు ఎక్కువుంటే అక్కడ ఎంఐఎం అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. సంచలన ఫలితాలు రాబడుతున్నారు.

ఇప్పుడు తమిళనాడులోనూ తమ ప్రభావం చూపేందుకు ఎంఐఎం సిద్ధమవుతుండగా.. ఆ పార్టీతో దోస్తీకి కమల్ హాసన్ ఆసక్తి చూపుతున్నారట. రెండేళ్ల కిందటే కమల్ మక్కల్ నీది మయ్యం పేరుతో పార్టీని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచారు కానీ.. పెద్దగా ప్రభావం చూపలేదు.

ఐతే కమల్ ప్రధాన లక్ష్యంగా వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే. అందులో తన పార్టీకి మంచి అవకాశాలున్నాయని భావిస్తున్న ఆయన.. పొత్తు కోసం ఇప్పుడున్న సంప్రదాయ పార్టీలను కాకుండా, కొత్తగా తమిళనాడులో రంగంలోకి దిగాలనుకుంటున్న ఎంఐఎంతో దోస్తీకి రెడీ అవుతున్నారట. ఆయనకు ముస్లింల పక్షపాతిగా పేరుంది. హిందుత్వ భావజాలంలో రాజకీయాలు చేసే భాజపా అంటే ఆయనకు అస్సలు గిట్టదు. ఇటీవల మోడీ సర్కారును అదే పనిగా ఆయన టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంఐఎంతో జట్టు కట్టడానికి కమల్ రెడీ అవుతున్నారట.

జనవరి నెలాఖర్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెన్నైకి వెళ్లి కమల్‌తో చర్చలు జరిపి పొత్తుకు తుది రూపం ఇవ్వనున్నారట. తమిళనాట దాదాపు 25 సీట్లలో పోటీ చేయాలని ఎంఐఎం నిర్ణయించుకుంది. ఈ 25 సీట్లలోనూ కమల్ హసన్‌తో పొత్తు పెట్టుకోవాలని ఒవైసీ నిర్ణయించుకున్నారు. తమిళనాట ఇప్పటికే అనేక ముస్లిం పార్టీలున్నాయి. అయితే వాటన్నింటినీ ఏకతాటిపైకి తేవాలని ఒవైసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వెల్లోర్, రాణిపేట్, తిరుపట్టూర్, కృష్ణగిరి, రామనాథపురం, పుడుకొట్టాయ్, తిరుచ్చి, మదురై, తిరునల్వేలీ ప్రాంతాల్లో ముస్లింలు అధికంగా ఉన్నారు. ఈ ప్రాంతాల్లో కమల్ పార్టీ అండతో అత్యధిక స్థానాలు సాధించాలని అసద్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.