సంగారెడ్డికి జగ్గారెడ్డి గుడ్ బై!

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని జగ్గారెడ్డి గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. తన సొంత పార్టీపై అయినా..విపక్షాలపై అయినా నిర్మొహమాటంగా తన అభిప్రాయలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పే నేత జగ్గారెడ్డి.

తనదైన వ్యాఖ్యలతో జగ్గారెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే జగ్గారెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక జీవితంలో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని చాణక్య శపథం చేశారు.

అంతేకాదు, ఒకవేళ భవిష్యత్తులో సంగారెడ్డిలో తన భార్య నిర్మల పోటీ చేసినా ఆమె తరఫున తాను ఎన్నికల ప్రచారానికి రానని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని సంగారెడ్డి ప్రజలను అడగబోనని కరాఖండిగా చెప్పేశారు.

త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తన పక్కనే ఉన్నారని, వారికి కూడా ఈ విషయం చెప్పానని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రచారం చేస్తాకానీ, సంగారెడ్డిలో మాత్రం ప్రచారం చేసే ప్రసక్తే లేదని అన్నారు. ఇందిరా గాంధీ మనవడు రాహుల్ గాంధీ తన కోసం సంగారెడ్డి వచ్చి ప్రచారం చేసినా తనను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు.

తన భుజంపై రాహుల్ గాంధీ చేయి వేసి ఓటు వేయాలని కోరినా ఓటేయలేదని భావోద్వేగానికి లోనయ్యారు. సంగారెడ్డి ప్రజలు అలా చేయడం రాహుల్ గాంధీని అవమానించడమేనని అన్నారు. అయితే, తన ఓటమికి పేదలు కారణం కాదని, ఇక్కడి మేధావులు, పెద్దలు అని అసహనం వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో ఓటమి తన జీవితంలో మరిచిపోలేనని ఎమోషనల్ అయ్యారు.