వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ షాక్!

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించి వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది.

లిక్కర్ స్కామ్‌లో భారీగా హవాలా లావాదేవీలు, మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తున్న ఈడీ, ఈ కోణంలో విజయసాయిరెడ్డి పాత్రపై స్పష్టత కోసం విచారణ చేపట్టనుంది. ఈ నోటీసులు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఒకప్పుడు వైసీపీలో కీలక నేతగా, పార్టీ వ్యవహారాల్లో చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి సుమారు ఏడాది క్రితం పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాకినాడ పోర్టు వ్యవహారాలకు సంబంధించి ఆరోపణలు వెల్లువెత్తగా, ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టింది.

ఇదే సమయంలో ఏపీ లిక్కర్ స్కామ్‌లో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డేనని విజయసాయిరెడ్డి బహిరంగంగా ఆరోపణలు చేయడంతో, ఆ వ్యాఖ్యల ఆధారంగా సీఐడీ ఆయనను విచారణకు పిలిపించింది. అయితే విచారణ అనంతరం అనూహ్యంగా సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో విజయసాయిరెడ్డినే నిందితుడిగా చేర్చడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.

ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్‌లో వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు ఆరోపణలు ఎదుర్కొంటుండగా, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్టై జైలు పాలయ్యారు. రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఈ కేసులో ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగడంతో దర్యాప్తు మరింత కీలక దశకు చేరింది.

ఈడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డిని కూడా తమ కేసులో నిందితుడిగా చేర్చే అవకాశముందన్న ప్రచారం సాగుతోంది. అలా జరిగితే ఆయనకు న్యాయపరంగా మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.