అదేంది సజ్జన్నార్ సార్… అంత మాట అనేశారు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న పోలీసుల్లో ప్రజలకు సుపరిచితులుగా.. అందరూ అభిమానించే అధికారులు కొందరుంటారు. ఆ కోవలోకే వస్తారు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జన్నార్. పోలీసు ఉన్నతాధికారిగా ఉన్నప్పటికి సందర్భానికి తగ్గట్లు మాట్లాడటమే తప్పించి.. తొందరపడి మాట్లాడినట్లుగా కనిపించదు. మాటల కంటే చేతల్లో తాను చేయాల్సిన పని చేస్తారని.. పీపుల్స్ ఫ్రెండ్లీ ఆఫీసర్ గా ఆయనకున్న పేరు అంతా ఇంతా కాదు. అలాంటి ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు.. ఆయన మాటల తీరు ఇప్పుడు సంచలనంగా మారింది.

తెలుగునాట పాపులర్ చానల్ ఒకటి.. ఈ మధ్యన ఆఫ్ ది రికార్డు పేరుతో ప్రసారం చేసిన ఒక కథనం అత్యంత వివాదాస్పదంగా మారింది. అందులో రాష్ట్ర మంత్రి ఒకరికి.. ఒక మహిళా ఐఏఎస్ కు మధ్య సమ్ థింగ్ ఉందంటూ అత్యంత చౌకబారు కథనాన్ని ప్రసారం చేసింది. దీనిపై పలువురు తప్పు పట్టారు. తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

దీనిపై సదరు మంత్రితో పాటు.. ఐఏఎస్.. ఐపీఎస్ అధికారుల సంఘం సైతం సీరియస్ అయ్యింది. పోలీసు కేసు పెట్టాలని కంప్లైంట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ కేసు విచారణకు సజ్జన్నార్ నేత్రత్వంలో సిట్ ను నియమించింది. దీంతో.. సదరు చానల్ ప్రతినిధులకు విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు.

ఇదిలా ఉంటే.. సదరు చానల్ కు చెందిన ఇన్ ఫుట్ ఎడిటర్ ను విదేశాలకు వెళ్లిపోతున్నారంటూ శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. మరో మీడియా ప్రతినిధిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించే ప్రయత్నం చేశారు. దీనిపై జర్నలిస్టు సంఘాలు.. జర్నలిస్టులు నిరసనను.. ఆందోళనను వ్యక్తం చేసిన పరిస్థితి. నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయటం ఏమిటి? అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఇలాంటి వేళ.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగుతున్న న్యూమాయిష్ కు వచ్చిన సజ్జన్నార్ ను మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు వేశారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయన్న ఆందోళనను వ్యక్తం చేసిన మీడియా ప్రతినిధుల మాటలకు అనూహ్య రీతిలో స్పందించిన సజ్జన్నార్.. ‘‘ఎమర్జెన్సీ పరిస్థితే ఉంటే మీరందరూ బయట ఉండేవారా? మీ అందరితో మాట్లాడేవాడినా? మీరందరూ కూడా లోపలే ఉండేవారు. మహిళా ఐఏఎస్ అధికారిపై వ్యక్తిగత విమర్శలు.. నిరాధార ఆరోపణలు చేసిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. వారు పోలీసు విచారణకు సహకరించకుండా పారిపోయే ప్రయత్నం చేస్తుంటే అరెస్టు చేశాం’’ అని వ్యాఖ్యానించారు.

అయితే.. మీడియా ప్రతినిధులకు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయటమేమిటి? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘నోటీసులు ఎందుకు ఇవ్వాలి? పోలీసు విచారణకు పిలిస్తే రావాలి. తప్పు చేయకుంటే ఎందుకు భయపడుతున్నారు? రిపోర్టర్లు ఎందుకు పారిపోతున్నారు. అప్పటికప్పుడు బ్యాంకాక్ కు టికెట్ బుక్ చేసుకొని పరారయ్యే యత్నం చేసినందుకు అరెస్టు చేశాం. మరో రిపోర్టర్ విచారణకు వస్తారని చెప్పి ఫోన స్విచ్ఛాఫ్ చేశారు’’ అంటూ వ్యాఖ్యానించారు.

సజ్జన్నార్ చెప్పినట్లుగా మీడియా ప్రతినిధులు కావొచ్చు.. ఇంకెవరైనా కావొచ్చు.. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే వారిని అరెస్టు చేయటం తప్పు కాదు. అయితే.. అరెస్టుకు ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా? దాన్నిపాటించాలన్న ప్రశ్నకు.. పోలీసులు పిలిస్తే రావాల్సిందే అంటూ వ్యాఖ్యలు చేయటం దేనికి నిదర్శనం? అన్నది జర్నలిస్టు వర్గాల్లో చర్చగా మారింది.

అంతేకాదు.. అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయన్న ప్రశ్నకు ఆయన తన సహజ తీరుకు భిన్నంగా స్పందించిన తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది. సజ్జన్నార్ లాంటి స్థాయి అధికారి.. మీడియాతో మాట్లాడే సందర్భంలో సంయమనం ప్రదర్శించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మర్చిపోవటమేమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

సదరు చానల్ లో టెలికాస్ట్ అయిన కథనాన్ని ఎవరూ సమర్థించరు. అదే సమయంలో వారిపై చట్టప్రకారం తీసుకునే చర్యల్ని ప్రశ్నించలేరు. కానీ.. అందుకు ప్రొసీజర్ ఫాలో కాకుండా.. హడావుడి చర్యలు ఏమిటి? అన్నదే ప్రశ్న. సంచలన ఆరోపణలతో ముడిపడి ఉండే కేసుల విషయంలో తొందరపాటుతో కాకుండా సిస్టంను ఫాలో కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ వాదనకు బలం చేకూరేలా అరెస్టు చేసిన మీడియా ప్రతినిధులకు న్యాయస్థానం బెయిల్ ఇవ్వటం గమనార్హం. పోలీసుల వాదనతో ఏకీభించని కోర్టు.. మీడియా ప్రతినిధుల న్యాయవాది వాదనతో ఏకీభవించి.. వారికి రిమాండ్ విధించకుండా బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.