రాష్ట్ర ప్రభుత్వానికి నిన్న మొన్నటి వరకు ఆర్థిక ఇబ్బందులు ఎదురైన విషయం తెలిసిందే. ముఖ్యంగా వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని సీఎం చంద్రబాబు సహా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారని.. దీనిని సరిదిద్దేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నామని కూడా ముఖ్యమంత్రి చెప్పారు.
మొత్తంగా గడిచిన 18 మాసాల్లో తీసుకున్న చర్యల ఫలితంగా ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ గాడిలో పడింది. ప్రస్తుతం గత ఏడాదితో పోల్చుకుంటే రాష్ట్ర ఆదాయం 4.9 శాతం మేరకు వృద్ధి చెందినట్టు ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.
దీనిని త్వరలోనే 10 శాతానికి చేర్చనున్నట్టు చెబుతున్నారు. మరోవైపు 2047 నాటికి తలసరి ఆదాయాన్ని 54 లక్షల రూపాయలకు పెంచే దిశగా కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే పెట్టుబడుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోంది. తద్వారా.. ప్రజల వృత్తులు, ప్రమాణాలు పెరిగి.. వారి ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తోంది.
మరోవైపు.. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ మార్గాలు కూడా పెరుగుతున్నాయి. పలు రూపాల్లో ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే రహదారి సెస్పును అమలు చేయనుంది. తద్వారా ఏటా 4 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా.
దీనిలో కొంత భాగాన్ని రహదారులకు కేటాయించినా.. మరికొంత ఇతర ఖర్చులకు కేటాయించే అవకాశం ఉంటుంది. ఇక, ఇప్పటికే మద్యంపై వస్తున్న ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు కూడా ప్రభుత్వం సంక్రాంతి నుంచి రూ.10 చొప్పున బాటిల్ ధరలను పెంచింది. దీంతో మరో 600 కోట్ల రూపాయల వరకు అదనంగా ఆదాయం లభించనుంది.
అదేవిధంగా ఇప్పటికే ఒకసారి రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచారు. దీనివల్ల ప్రస్తుతం 300 కోట్ల రూపాయల వరకు అదనంగా రెవెన్యూ శాఖ నుంచి రాబడి పెరిగింది. వచ్చే ఏప్రిల్ నాటికి మరోసారి రిజిస్ట్రేషన్ చార్జీలను ప్రక్షాళన చేయడం ద్వారా.. ఆదాయ మార్గాలను అన్వేషించేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే.. ఏది చేసినా గతంలో వైసీపీ మాదిరిగా వివాదాలకు అవకాశం ఇవ్వకుండా.. ప్రజలకు ఆమోద యోగ్యమైన రీతిలోనే వ్యవహరిస్తుండడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకునే నిధులను మరింత పెంచుకునే దిశగా కూడా ప్రభుత్వం ఇప్పటికే అంచనాలు ఇచ్చింది.
వచ్చే వార్షిక బడ్జెట్‌లో ఈ మేరకు కేంద్రం కేటాయింపులు ఉంటే అది మరింతగా రాష్ట్రానికి మేలు చేయనుంది. అంతేకాదు.. కేంద్రం నుంచి వచ్చేరాయితీలు, ఇన్సెంటివ్‌లను కూడా పెంచుకునేందుకు సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించనున్నాయి. మొత్తంగా.. రాష్ట్రానికి గత ఏడాదికంటే కూడా ఈ ఏడాది మరింతగా ఆదాయం పెరగనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates